Vizianagaram Government land grab : అది ప్రభుత్వ భూమి అని ఆ గ్రామ ప్రజలు అందరికీ తెలుసు. ఆ గ్రామం కాని వాళ్లకు.. ఆ దారిన పోయే వాళ్లకూ తెలుసు. ఎందుకంటే ఆ భూమిలో ప్రభుత్వ భూమి అనే బోర్డు ఉంటుంది. ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుటామన్న హెచ్చరికలు కూడా ఆ బోర్డుపై ఉంటాయి. అందుకే అందరూ అది ప్రభుత్వ భూమి అని దాని జోలికెళ్లరు. కానీ అది ప్రభుత్వ భూమి అని తెలిస్తే అంటే మాదే అనుకునే మహానుభావులు కొంత మంది ఉంటారు. వారి కన్ను పడితే.. ఆ బోర్డులు అన్నీ మాయపోతూ ఉంటాయి. ఈ భూమి విషయంలోనూ అదే జరుగుతోంది.    

జొన్నాడలో 12 ఎకరాల పోరంబోకు భూమి      

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జొన్నాడ గ్రామంలో సుమారు 12 ఎకరాలు వాగు పోరంబోకు భూమి ఉంది. తరాలుగా ప్రభుత్వ రికార్డుల్లో అలాగే ఉంది. ఇప్పటికీ అలాగే ఉంది. కానీ హఠాత్తుగా ఆ భూమిలో ఉన్న ప్రభుత్వ భూమి అనే బోర్డు మాయమైపోయింది. జొన్నాడ రెవెన్యూలో సర్వేనెంబర్ 70/1  లో ప్రభుత్వ భూమి .. సుమారు 12 ఎకరాలు వాగు పోరంబోకు అన్యాక్రాంతం చేసుకునేందుకు పక్కా ప్లాన్ తోనే బోర్డు తీసేశారు. ఆ గ్రామంలో ఉండే  రియల్ ఎస్టేట్ వ్యాపారి  కన్ను ఈ భూమిపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయనే ఇప్పుడు కొంత మంది అధికారులతో కలిసి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాన్ అమలు చేయడానికే ప్రభుత్వ భూమి అనే బోర్డును తొలగించినట్లుగా చెబుతున్నారు.  

గతంలోనూ కబ్జా ప్రయత్నం చేయడంతో అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు - బోర్డు ఏర్పాటు 

ఈ భూమి జాతీయరహదారికి సమీపంలో ఉండటంతో అత్యంత విలువైనదిగా మారింది. అందుకే గతంలోనూ ఇలాంటి కబ్జా ప్రయత్నాలు జరిగాయి. దీంతో గ్రామస్తులంతా అధికారులుక ఫిర్యాదు చేశారు. అప్పడ్లో జాయింట్ కలెక్టర్ గా ఉన్న అధికారి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కొలతలు వేసి.. ప్రభుత్వ భూమి అనే బోర్డును ఏర్పాటు చేయించారు. అయితే ఇప్పుడు  జాయింట్ కలెక్టర్  బదిలీ అయ్యారు. మరో అధికారి వచ్చారు. ఆయనకు ఏమీ తెలియదని అనుకున్నారేమో కానీ.. బోర్డును తీసేసి కబ్జా పనులు ప్రారంభించారు.              

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి అదే ప్రయత్నమని ఆరోపణలు          

ప్రస్తుతం  రియల్ ఎస్టేట్ వ్యాపారి .. ఆ భూమి అంతా తనదేనన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇతరుల్ని అందులోకి వెళ్లనీయడం లేదు. ప్రభుత్వ భూమి అనే బోర్డులు కూడా లేకపోవడంతో.. ఆయన ఆ భూమి తనదేనని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లతో అమ్మకానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి.. మళ్లీ ప్రభుత్వ భూమి అనే బోర్డులు పెట్టి..కబ్జా ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.