ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 65,596 మంది నమూనాలు పరీక్షించగా 1,623 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,340 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,158 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 10 మంది కరోనా బారిన పడ్డారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణ అయ్యింది. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు నలుగురు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు ఉంది. అప్రమత్తమైన అధికారులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏవై 12
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినట్లే కనిపిస్తున్నా... థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. కరోనా మహమ్మారి రోజుకో రూపంతో వైద్యరంగానికి సవాల్ విసురుతోంది. ఇప్పటి వరకూ డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ప్రమాదకరం అనుకుంటే తాజాగా డెల్టా ప్లస్‌లో ఏవై.12 అనే మరో రకం మరింత ప్రమాదకరంగా మారింది. ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏవై.12 వేరియంట్ తొలి కేసు ఆగస్టు 30న ఉత్తరాఖండ్‌లో నమోదైంది. వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఏవై.12 కేసులు దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 178 నమోదయ్యాయి. ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు వచ్చాయి. ఈ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
దేశంలో పలు రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినప్పుడు డెల్టా పస్ల్ ఏవై.12 కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాల నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపి, వైరస్ వేరియంట్లను గుర్తిస్తున్నారు. ఈ పరిశోధనలో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది ఊపిరితిత్తుల కణాల్లో బలంగా అతుక్కుపోయి మోనోక్లోనల్ యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు.