PM Kisan Yojana: రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 6000 రూపాయలు మూడు విడతలుగా ఇస్తారు. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. దీని కింద ఇప్పటివరకు 12 వాయిదాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం 13వ వాయిదా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
ఈ పథకం రైతుల కోసం ఉద్దేశించి ప్రవేశపెట్టారు. అయితే రైతులు కానివారు సైతం దీనికింద డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి వారిని నివారించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ కేవైసీ లాంటి వాటిని పెట్టింది. ఈ పథకం యొక్క లబ్ధిదారులు కొన్ని విషయాలు, ఇంకా ఇందులో చేసిన మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. దాని కోసమే ఈ కథనం.
ఆధార్ కార్డు తప్పనిసరి
రైతులు ఈ పథకం పొందాలనుకుంటే కచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. దాని ద్వారానే ఈ స్కీం కింద వచ్చే డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
మీరే చేసుకోవచ్చు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు సులభతరంగా మారింది. దీనికోసం లేఖపాల్, కనుంగో, వ్యవసాయాధికారిని కలవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఆధార్ కార్డు, దాన్ని అనుసంధానించిన బ్యాంక్ ఖాతా నంబరు ఉంటే చాలు. రైతులు ఇంట్లోనే కూర్చుని తమ సెల్ ఫోన్ ద్వారా సంబంధిత వెబ్ సైట్ కు వెళ్లి ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు.
తనిఖీ చేయడం సులభం
పీఎం కిసాన్ యోజన పథకం కింద మీరు మీ దరఖాస్తు స్థితిని పోర్టర్ లో ఇంతకుముందు మూడు మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు దాన్ని కూడా ఈజీగా మార్చారు. రైతులు రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నెంబర్ తో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.
రుణం తీసుకోవచ్చు
ఈ పథకం కింద ఇప్పుడు క్రెడిట్ కార్డును ఇస్తున్నారు. దీని ద్వారా సులభంగా కేసీసీను తయారుచేసుకోవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు 4 శాతం వడ్డీపై రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు రుణం లభిస్తుంది.
మాన్ ధన్ యోజనకు విడిగా అవసరంలేదు
పీఎం కిసాన్ యోజనతో అనుసంధానమైన వారు మాన్ ధన్ యోజన ప్రయోజనాన్ని పొందడానికి విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దీని ద్వారానే మాన్ ధన్ యోజనకు అర్హులవుతారు. అలాగే నెలకు రూ. 3వేల పెన్షన్ పొందవచ్చు.
ఈ- కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు కచ్చితంగా ఈ- కేవైసీ చేయించాలి. దీనిపై కేంద్రప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇలా చేయకపోతే ప్రస్తుతం రావాల్సిన వాయిదా డబ్బులు ఆగిపోతాయి.