Telangana Farmers loans : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఆరు గ్యారెంటీలను విడతల వారిగా అమలు చేస్తామని ప్రమాణస్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్నట్లుగానే రెండు గ్యారెంటీలను అమలు చేసేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులును 10 లక్షలకు పెంచారు. ఆర్టీసీ బస్సుల్లో 15 లక్షల మందికిపైగా మహిళలు ఉచితంగా ప్రయాణించారు. తాజాగా మరో రెండు హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 2వందల యునిట్ల వరకు ఉచిత కరెంట్ ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆయా విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. 200 యునిట్ల వరకు ఉచిత కరెంటును తెల్ల రేషన్ కార్డు దారులకు త్వరలోనే అమలు చేయనుంది. 


రుణమాఫీపై విధివిధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం
అన్నదాతల తీసుకున్న రుణాలపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే రుణమాఫీ చేయబోతున్నట్టు ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కారు.. మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి 2 లక్షల రుణం మాఫీ చేసిన తర్వాత రైతులకు ఇచ్చే రుణాలను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. అన్నదాతలకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పట్టించుకోలేదన్న ప్రతిపక్షాల విమర్శలను ఇప్పటికే తిప్పికొట్టింది. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల మేర రైతు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 


 3 లక్షల దాకా అన్నదాతలకు రుణాలు
బ్యాంకుల వారీగా రైతుల అప్పుల వివరాలు సేకరిస్తోంది. పూర్తి సమాచారం అందగానే.. రుణమాఫీ అమలు చేయనుంది. రాష్ట్రంలో అన్నదాతలు తీసుకున్న మొత్తం పంట రుణాలు దాదాపుగా రూ.20 వేల కోట్ల నుంచి.. రూ.25 వేల కోట్ల వరకు ఉండొచ్చని సర్కారు అంచనా వేస్తోంది.  రుణమాఫీని విడతల వారీగా కాకుండా.. ఒకేసారి మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ మొత్తాన్నీ ఒకేసారి మాఫీ చేసి.. ఆ తర్వాత బ్యాంకులకు విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నదాతలకు రుణం ఇచ్చే విషయంలోనూ మరింత ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల రుణ ఆధారంగా రూ. 3 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు అందించేందుకూ చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రైతులు చెల్లిస్తున్న పావలా వడ్డీని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 


కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది  ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.