Raithu Bharosa: వర్షాలు సమృద్ధిగా పడటంతో ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. రైతులంతా పొలాలు దున్ని విత్తనాలు నాటడం పూర్తయ్యింది. అయినా ఇప్పటికీ తెలంగాణ(Telangana) ప్రభుత్వం నుంచి రైతుకు ఎలాంటి సాయం అందలేదు. రైతులకు పెట్టుబడిగా సాగు సమయంలో అందించే రైతు భరోసా(Raithu Bharosa) సాయం కోసం తెలంగాణలో అన్నదాతలు ఎదురు చూపులు తప్పడం లేదు.


రైతు భరోసా ఎప్పుడు
అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు 15వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని తెలంగాణ(Telangana)లో గద్దెనెక్కిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం...ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులు దాటినా ఇప్పటికీ రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రైతుభరోసా(Raithu Bharosa) పథకంపై అధ్యయనం చేసి విధివిధానాలు రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని(Cabinet Sub Commitee) ఏర్పాటు చేసింది. డివ్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Batti Vikramarka) అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswararao), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasareddy), శ్రీధర్‌బాబు(Sridharbabu)తో కమిటీ వేశారు. అయితే రైతు భరోసా పథకం ఎవరెవరికి వర్తింపజేయాలి..ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నదానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామాలవారీగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రతి సహకారసంఘం పరిధిలో రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 5 ఎకరాలు, 8 ఎకరాలు, పది ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాల లోపు వారికి ఈ పథకం వర్తింపజేస్తే బాగుంటుందన్నది వారి నుంచే సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించనుంది.


పక్కాగా అమలు 
రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Reavanth Reddy) భావిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో పంటలు వేయని బీడు భూములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారంపడింది.పైగా వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల ప్రచారంలోనే రైతు భరోసాపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.  అందులో భాగంగా ఊరూరా సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములు ఎన్ని, వ్యవసాయేతర భూములు ఎన్ని అన్నదానిపై సర్వే జరుగుతోంది. ఫైలట్‌ ప్రాజెక్ట్‌గా కామారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే సర్వే పూర్తయ్యింది. మిగిలిన జిల్లాల్లోనూ వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఏరివేత
గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం రైతు భరోసా సాయం అందజేశారు. బడా భూస్వాములు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, ఇన్‌కంటాక్స్ కట్టేవారు, ఫాంహౌస్ ఉన్న భూములు, రీసార్ట్‌లు ఉన్న భూములు, కమర్షియల్ వ్యాపారాలకు వినియోగిస్తున్న భూములకు సైతం రైతు భరోసా డబ్బులు పడేవి. దీంతో ఈ పథకం అమలుపై చాలా విమర్శలు వచ్చాయి.పన్నులు ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది మండపడ్డారు. దీంతో సర్వేద్వారా ఇలాంటి భూములన్నింటినీ తొలగించనున్నారు. దీంతో ప్రభుత్వంపై భారం తగ్గిపోవడంతోపాటు అర్హులకు మాత్రమే సాయం అందే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు పైసా కూడా చెల్లించేది లేదని సీఎం స్పష్టం చేశారు