Rythu Bandhu Scheme Money Credited to Farmer Accounts, Check Rythu Bandhu Money Status here
Rythu Bandhu scheme: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇటీవల నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్) సీజన్​కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు (Rythu Bandhu Money) పంపిణీని టీఆర్ఎస్ సర్కార్ మంగళవారం మొదలుపెట్టింది. ఈ సీజన్‌కుగానూ రాష్ట్రంలో 68,94,486 మంది (68 లక్షల 94 వేల 486 మంది) రైతులకు రైతు బంధు వర్తిస్తుంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా అన్నదాతలకు పంట సాయం అందిస్తుంది.


నేడు వారి ఖాతాల్లోకి నగదు జమ..
నేటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ కానుండగా, నేడు ఎకరాలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు నగదు జమ అవుతుంది. ఎకరాకు రూ.5 వేలు చొప్పున విడతల వారీగా రూ.7,654.43 కోట్లను రైతులకు ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలో మొత్తం 1.53 కోట్ల ఎకరాలకు, ఈ ఏడాది రైతు బంధు వర్తిస్తుండగా... కొత్తగా 1.50 లక్షల ఎకరాల భూమి రైతుబంధు లబ్ధి పొందే జాబితాలో చేరింది. ఎకరంలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేడు రూ. 586 కోట్లు జమ అవుతాయి. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను (Agri Culture Extension Officer) సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది. 


రైతు బంధు అర్హుల జాబితాలో మీరు ఉన్నారా..



  • అధికారిక వెబ్‌సైట్ http://rythubandhu.telangana.gov.in/ వెబ్ సైట్‌కి వెళ్లండి

  • హోం పేజీలో రైతు బంధు స్కీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి

  • అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ (Cheque Distribution Venue Schedule) మీద క్లిక్ చేయాలి

  • ఆ తరువాతి పేజీలో మీ జిల్లా (District), మండలం (Mandal) సెలక్ట్ చేసుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది

  • అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది


రైతు బంధు నగదు జమ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి



  • తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ https://treasury.telangana.gov.in/ కు వెళ్లండి

  • హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి

  • అనంతరం రైతు బంధు అందుకునే సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి

  • స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాలి

  • వివరాలు మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.

  • అయితే నేడు రైతులకు నగదు ప్రారంభించారు కనుక మరికొన్ని రోజుల్లో అధికారులు ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు.


ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. తొలిసారిగా ధర్మరాజుపల్లి వాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు. అప్పటినుంచి రాష్ట్రంలో రైతు బంధు కొనసాగుతుండగా.. నేడు రైతులకు 9వ విడుత నగదు సాయం ప్రారంభించారు.