Telangana: రాష్ట్రం పచ్చని మాగాణిలా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నీటి వసతి ఏర్పడటంతో గతంలో కంటే సాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్ లో వరి సాగు విస్తీర్ణం లక్ష్యాన్ని అధిగమించింది. 49,86,634 ఎకరాల సగటుకు 55,90,978 ఎకరాలలో అంటే 112.12 శాతం నాట్లు పడ్డట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం 55,08,313 ఎకరాల కంటే ఇది 82 వేల ఎకరాలు అధికం. అలాగే 44 లక్షల 70 వేల 360 ఎకరాలతో పత్తి రెండో స్థానంలో నిలిచింది.  ప్రతీ సంవత్సరం ఈ సీజన్ పంటల మొత్తం సాగు లక్ష్యం కోటి 24 లక్షల 28 వేల 723 ఎకరాలకు ఈసారి 1.16 కోట్ల ఎకరాలతో 94 శాతం సాధించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదించింది. 13 జిల్లాలు 100 శాతానికి పైగా సాగు లక్ష్యాన్ని అధిగమించాయని తెలిపింది. మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, పప్పు దినుసులు, సోయాబీన్, పత్తి సాగు కాలం ముగిసిందని.. సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు కొనసాగనున్నాయని తెలిపింది. తద్వారా మొత్తం సగటు సాగు విస్తీర్ణం దాటే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 


రాష్ట్రంలో 24.75 శాతం సజ్జలు, 18.48 శాతం రాగులు, 15.59 శాతం ఉలవలు, 13.35 శాతం బొబ్బర్లు, 6.009 శాతం పొద్దు తిరుగుడు, కొర్రలు, సామలు వంటి చిరు ధాన్యాలు 10.98 శాతం సాగు అయినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మెదక్ లో 122.8 శాతం మహబూబాబాద్ లో 111.99 శాతం, ఆసిఫాబాద్ 109.46 శాతం, జగిత్యాలలో 106.84 శాతం, జనగామలో 106.42 శాతం, నిజామాబాద్ లో 105.60 శాతం, ఆదిలాబాద్ లో 104.49 శాతం, నిర్మల్ లో 103.02 శాతం, యాదాద్రి 103.99 శాతం, సంగారెడ్డిలో 102.56 శాతం, సిద్దిపేటలో 101.31 శాతం, భద్రాద్రిలో, వికారాబాద్ లో 100.. ఇలా ఈ జిల్లాలన్నీ 100 శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించాయి. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలు 75 శాతం లక్ష్యం చేరగా.. మిగతావి వంద శాతానికి చేరువగా ఉన్నాయి. అలాగే రాష్ట్ంలో ఆగస్టులో ఇప్పటి వరకు 208.4 మిల్లీ మీటర్ల వర్షపాతానికి 79.7 మిల్లీ మీటర్ల వర్షమే పడింది. ఈనెలలో 62 శాతం లోటుగా ఉందని తెలిపింది.