Vemulawada MLA Chennamaneni Ramesh: 


బీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును తెలంగాణ ప్రభుత్వం ప్రధాన సలహాదారుగా (వ్యవసాయ రంగ వ్యవహారాలు) నియమించింది. తనకు బాధ్యతలు అప్పగించిన తరువాత ప్రభుత్వ ప్రధాన సలహాదారు హోదాలో తొలిసారిగా సీఎం కేసీఆర్ ను చెన్నమనేని రమేశ్ కలిశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తనను నియమించినందుకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.


సీఎం కేసీఆర్ ను కలిసిన అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆరు దశాబ్దాల సంక్షోభాన్ని కేవలం దశాబ్ది కాలంలో స్వరాష్ట్రంలో సాధించుకున్నాం అన్నారు. అందుకు సీఎం కేసీఆర్ నాయకత్వం, విజన్ కారణం అన్నారు. కేసీఆర్ నాయకత్వంతో కేవలం పదేళ్లలోనే రాష్ట్రంలో వ్యవసాయ రంగం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. 


సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణలో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాల అమలు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు రమేశ్ బాబు. వ్యవసాయాభివృద్ధిలో సైతం అధిక దిగుబడులు, ప్రభుత్వ పథకాలతో మిగతా రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమౌతున్న సమయంలో తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. 


వేములవాడ టికెట్ ఇవ్వని కేసీఆర్.. కేబినెట్ హోదా పదవి
పౌరసత్వ సమస్య వెంటాడుతున్న కారణంగా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ టికెట్ కేటాయించలేదు. కానీ ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. కేబినెట్ హోదాతో సమానమైన ఈ పదవిలో... రమేష్ బాబు ఐదేళ్ల కాలం పాటు కొనసాగనున్నారు. చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక హంబోల్ట్ యునివర్సిటీ నుంచి అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో పరిశోధనలు చేసి హీహెచ్‌డీ సాధించారు. పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా రమేష్ బాబుకు అగ్రికల్చర్ ఎకానమీ అంశం పట్ల ఉన్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 


బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవటంతో.. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ఘన్ పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య. ఆరు నూరైనా, నూరు నుటయాభై అయినా...తాను మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. పైన దేవుడున్నాడని.. దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నారని అన్నారు. రేపోమాపో తాను అనుకున్న కార్యక్రమం జరుగనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తానున్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని చెప్పుకొచ్చారు. దీంతో రాజయ్యకు కూడా నామినేటెడ్ పోస్టు కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,  వైరా శాసనసభ్యులు రాములు నాయక్ లకు కేబినెట్ హోదాతో సమానమైన పదవులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.