Oil Palm Industries: ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు లాభాలు చేకూర్చే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఆయిల్‌ఫెడ్) ఆధ్వర్యంలో 6 జిల్లాల్లో పామాయిల్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.1,250 కోట్లను వెచ్చించనుంది. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిచడానికి, వినియోగదారులకు పామాయిల్ ను అందుబాటులో తేవడానికి, స్థానికులకూ ఉపాధి కల్పించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎకరాకు రూ.51 వేల రాయితీ
తెలంగాణలో 2025 సంవత్సరం నాటికి ఆయిల్ పామ్ సాగును 25 లక్షల ఎకరాలకు పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ కు భారీ ఎత్తున రాయితీలు ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఎంపిక చేసింది ప్రభుత్వం. ఒక్కో ఎకరానికి రూ. 51 వేల రాయితీని ఇస్తోంది. బిందు సేద్య విధానాన్ని సర్కారు సమకూరుస్తోంది. ఆయిల్ పామ్ పంట వేస్తే.. నాలుగేళ్లలో పంట కోతకు వస్తుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ముడి, శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ముందుకు వచ్చింది. ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట, అప్పారావు పేటల్లో పామాయిల్ శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి.
పరిశ్రమలకు ఇప్పటికే భూ కేటాయింపు పూర్తి
కొత్తగా సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు ఈ పరిశ్రమలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమను రూ. 300 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో ఒక్కోటి రూ. 200 కోట్ల చొప్పున, గద్వాలలో రూ. 150 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ పరిశ్రమకు ఇప్పటికే 95 ఎకరాలను సేకరించారు. మిగిలన ప్రాంతాల్లో 65 నుంచి 85 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Also Read: YS Sharmila: 'కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది', సోనియాతో భేటీ అనంతరం షర్మిల వ్యాఖ్యలు
3 ఏళ్లలో కోతకు రానున్న గెలలు
ఆయా కేంద్రాల పరిధిలో 8 వేల నుంచి 10 వేల ఎకరాల్లో ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు అవుతోంది. మరో మూడు సంవత్సరాల్లో గెలలు కూడా వస్తాయి. గంటకు 60 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఒక్కో పరిశ్రమతో 500 మంది ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. కొత్త పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో రోజుకు 3,600 టన్నుల మేరకు పామాయిల్ అందుబాటులోకి వస్తుందని ఆయిల్ ఫెడ్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశ్రమలతో ఒక వైపు రైతులకు ఆదాయంతో పాటు మరో వైపు పరిశ్రమల స్థాపనతో ఉపాధి కూడా లభించనుందని అధికారులు చెబుతున్నారు. అలాగే పామాయిల్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి కూడా తగ్గుతుంది.