Harish Rao: తెలంగాణలో ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చారని ఆర్థిక, ఆరోగ్య, వైద్య, సంక్షేమ శాఖా మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రి హర్షం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు.
అందులో ఆయన పేర్కొంటూ.. ‘అర్హులైన రైతులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఎల్ఐసీకి (LIC) ప్రీమియం చెల్లిస్తోంది. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ తెలంగాణా ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. పథకాన్ని ప్రారంభించిన తొలి ఏడాది (2018-19)లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకున్నారు. 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు చేరింది.
2018లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, నేడు రూ.1,477 కోట్లు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకూ రైతుల తరఫున ప్రభుత్వం రూ. 6,861 కోట్లు ప్రీమియం చెల్లించింది. వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ.5,402 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. గుంట భూమి ఉన్న వారిని సైతం రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు. రైతుల గురించే కాదు వారి కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా కృతజ్ఞతలు’’ అని హరీశ్‌రావు తెలిపారు.
ఏటా పెరుగుతున్న రైతుల సంఖ్య
2023-24 సంవత్సరానికి మరో 3.34 లక్షల మంది రైతులు రైతుబీమా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది రైతుబీమా పరిధిలో ఉన్న రైతుల సంఖ్య 37.70 లక్షలు ఉండగా ఈ ఏడాది 41.04 లక్షలకు పెరిగింది. ఏటేటా రైతుల సంఖ్యతో పాటు ప్రీమియం మొత్తం కూడా పెరుగుతోంది. రైతుకు ఎంత భూమి ఉందనే అంశంతో సంబంధం లేకుండా 18-59 ఏండ్ల వయసు రైతులందరికీ రైతుబీమా అమలు చేస్తున్నారు. యాక్సిడెంట్, అనారోగ్యం, ఇలా ఏ కారణంతో రైతు చనిపోయినా రైతుబీమా వర్తిస్తోంది.
ఒక్కో రైతు పేరు మీద రూ.3831 చెల్లిస్తున్న సర్కార్
ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎల్‌ఐసీకి ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం మొత్తం రూ.6,861.47 కోట్లకు చేరింది. అంటే ఒక్కో రైతు తరపున రూ.3,831 చొప్పున తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తోంది. రైతు బీమా కోసం దేశంలో ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఏటేటా రైతుల తరుపున చెల్లించాల్సిన ప్రీమియం భారం పెరుగుతున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఈ విధమైన బీమా పరిహారం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. కొన్ని రాష్ర్టాల్లో రైతులకు కేవలం వ్యవసాయ ప్రమాద బీమాను మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా, నయా పైసా భారం లేకుండా రైతులకు రైతు బీమా అమలు చేయడంపై ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ నిపుణులు అభినందనలు కురిపిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial