Loan Waiver: రాష్ట్రంలో రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీకి ప్రభుత్వం బ్యాంకుల్లో నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రుణ మాఫీ ప్రయోజనాన్ని కొందరు రైతులు మాత్రం అందుకోలేకపోతున్నారు. వ్యవసాయశాఖ, బ్యాంకుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకు నిబంధనల ప్రకారం పంట రుణ ఖాతా కాల పరిమితి 5 సంవత్సరాలు. ఆ మేరకు పంట రుణాన్ని రైతులు ఐదేళ్ల పాటు రీషెడ్యులు చేసుకోవచ్చు. ఆయా అప్పులు తీర్చి కొత్త ఖాతా తెరవాలి. ఇలా ఐదేళ్ల కాలంలో ఎంతో మంది రైతులు పాత ఖాతాలు మూసేసి కొత్త ఖాతాలు తెరిచి వాటి ద్వారా రుణాలు తీసుకున్నారు. ఖాతా మూసివేత, కొత్త ఖాతా ఓపెనింగ్ లాంటి వివరాలను పంటరుణమాఫీ వెబ్ సైట్లో అప్‌డేట్‌ చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. కానీ ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అనేది మాత్రం పట్టించుకోలేదు. దీంతో చాలా బ్యాంకులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఆయా రుణ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వం జమ చేసిన రుణమాఫీ సొమ్ము.. తిరిగి ట్రెజరీకి వెళ్లిపోయింది.


అయితే రైతులకు మాత్రం రుణమాఫీ అయినట్లు సమాచారం వచ్చింది. కానీ బ్యాంకులకు వెళ్తే ఇంకా రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు ఉండొచ్చని అంటున్నారు. ఈ కాలంలో ఎన్నికల కోడ్ వస్తే.. వెనక్కి వెళ్లిన రుణమాఫీ నిధులు మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న, రీషెడ్యూలు చేసుకున్న రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ బ్యాంకుల నుంచి వివరాలు తీసుకుంది. సాఫ్ట్‌వేర్‌ సాయంతో కుటుంబానికి రూ. లక్ష చొప్పున రుణమాఫీ చేసేలా అర్హులను ఎంపిక చేసింది. 42.56 లక్షల మందికి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. 


మొదట రూ.37 వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతుల కోసం రూ.1943.64 కోట్లు బ్యాంకులకు చెల్లించింది రాష్ట్ర సర్కారు. ఆగస్టు 3వ  తేదీన రూ. 41 వేల లోపు రుణాలు ఉన్న 62,758 మంది రైతులకు రూ. 237.85 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు 4వ తేదీన రూ.43 వేల లోపు రుణాలు ఉన్న 31,339 మంది రైతులకు రూ.126.50 కోట్లు రిలీజ్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రూ.99,999 పంట రుణాలు ఉన్న 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా దాదాపు 17 లక్షల మంది రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దాదాపు రూ. 8 వేల కోట్లను బ్యాంకుల్లో జమ చేసింది.


పాత రుణ ఖాతాలు మూసేసి కొత్తవి తెరచినప్పుడు బ్యాంకులు లేదా వ్యవసాయ శాఖ అధికారులు వాటిని నమోదు చేయాలి. బ్యాంకర్లు అప్‌డేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని వస్తోంది. వారిని అడిగితే.. మాకేం సమాచారం లేదు.. మీరే అప్‌డేట్‌ చేసుకోవాలని బ్యాంకర్లకు చెబుతున్నారు.