Kisan Credit Card: భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న కోట్లాది మంది రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక శుభవార్త చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీద ఇచ్చే స్వల్పకాలిక రుణాల కోసం అందించే రాయితీని (KCC వడ్డీ రాయితీ) ఈ ఆర్థిక సంవత్సరంతో (2022-23) పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) కూడా కొనసాగించాలని RBI నిర్ణయించింది.
పావలా వడ్డీకి రుణం
ఈ నిర్ణయం తర్వాత, కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న ప్రతి రైతుకు వ్యవసాయ సంబంధిత పనుల కోసం బ్యాంక్ రుణం లభిస్తుంది. ఈ అప్పు మీద 7 శాతం వడ్డీ ఉంటుంది. ఈ 7 శాతంలో, కేంద్ర ప్రభుత్వం 1.5 శాతం మొత్తాన్ని రాయితీ రూపంలో భరిస్తుంది. అంతేకాదు, ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. మొత్తంగా చూస్తే, కిసాన్ క్రెడిట్ కార్డ్ మీద తీసుకునే రుణం మీద కేవలం 4 శాతం వడ్డీ రేటు చెల్లిస్తే సరిపోతుంది. ఇది, పావలా లేదా 25 పైసల వడ్డీకి సమానం.
రూ.3 లక్షల రుణం
కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తుంది. రైతులు ఈ డబ్బును వ్యవసాయం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం, ఇతర వ్యవసాయ రంగ సంబంధిత పనులకు ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తదితరాల కోసం కూడా రైతులు ఈ రుణాన్ని తీసుకోవచ్చు. వడ్డీ రాయితీ పథకం (ISS) కింద, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాల మీద వడ్డీ మినహాయింపును ప్రకటిస్తూ.. సెంట్రల్ బ్యాంక్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, కో ఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లకు ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
మీరు రైతు అయితే, మీ దగ్గర ఇప్పటి వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ లేకపోతే, దానిని పొందడం చాలా సులభం. ఈ క్రింది పత్రాలు మీ దగ్గర ఉంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ చేతికి అందుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:
ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ అవసరం. తాను రైతును అని నిరూపించుకునేందుకు, రైతు పేరు మీద వ్యవసాయ భూమి పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
KCC కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ఆఫ్‌లైన్ పద్ధతి: మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి, అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి, KCC దరఖాస్తు ఫారం నింపాలి. దీనితో పాటు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాలి. మీరు సమర్పించిన అన్ని పత్రాలను బ్యాంక్ నిర్ధరించుకుంటుంది. ఆ తర్వాత మీ పేరిట కిసాన్ క్రెడిట్ కార్డ్ వస్తుంది.
ఆన్‌లైన్ పద్ధతి: ఇది కాకుండా, బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా కూడా మీరు KCC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో KCC దరఖాస్తు ప్రక్రియ అన్ని బ్యాంక్‌లకు కొద్దిగా మారుతుంటుంది. బ్యాంక్ సూచనలు పాటిస్తూ.. ఆన్‌లైన్ ఫారంలో అడిగిన మీ వివరాలు నింపి, మీ దగ్గర ఉన్న సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.