Telangana Farmers News Today | హైదరాబాద్: రైతు కమిషన్ సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఉదయం 6 గంటలకే బోయిన్ పల్లి మార్కెట్ కు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డి చేరుకున్నారు. పొద్దుపొద్దున్నే రైతు కమిషన్ మార్కెట్ యార్డుకు రావడంతో కొందరు అధికారులు కంగుతిన్నారు. దాదాపు గంటన్నర వరకు మార్కెట్ లో పర్యటించి అక్కడి సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం గుర్తించారు.
రైతులు, వ్యాపారులతో మాట్లాడిన కమిషన్ చైర్మన్, సభ్యులు
ఇతర రాష్ట్రాల నుండి బోయిన్ పల్లి మార్కెట్ కు వచ్చిన రైతులు, వ్యాపారులతో మాట్లాడిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గత నాలుగు రోజులుగా మార్కెట్ సెక్రెటరీ అందుబాటులో లేడని తెలియడంతో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయిన్ పల్లి మార్కెట్ లో రైతుల నుండి కొనుగోళ్లు, అమ్మకాల పై ఆరా తీసింది. అధికారుల చాంబర్లు, రసీదులు, అటెండెన్స్ రిజిస్టర్, రికార్డులను చెక్ చేశారు.
పలు రాష్ట్రాల నుంచి నగరానికి కూరగాయాలు
బోయిన్ పల్లి మార్కెట్ లో అమ్మకాలు కొనుగోళ్లకు సంబందించిన డేటా సేకరించింది. కూరగాలయ వ్యర్ధాల ద్వారా నిర్వహించే బయో గ్యాస్ ప్లాంట్ ను కమిషన్ సభ్యులు పరిశీలించారు.. కానీ ప్లాంట్ పనిచేయడం లేదు. ఏం చేస్తున్నారని అధికారులను కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. బోయిన్ పల్లి మార్కెట్ కు ఇతర రాష్ట్రాలు ఏపీ నుంచి నెల్లూరు, తమిళనాడు నుంచి చెన్నై, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూరగాయాలు వస్తున్నాయని తెలుసుకున్నారు. బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన బృందంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డి, కమిషన్ అధికారులు హరి వెంకట ప్రసాద్, మహేష్ తదితరులు ఉన్నారు
ఆకస్మిక తనిఖీలతో వ్యవసాయ మార్కెట్లు అలర్ట్
ఉదయం ఆరు గంటలు అంటే ఆ సమయానికి కొన్ని పనులు మొదలవుతుంటాయి. కానీ అంతా సరిగ్గా ఉందా, రసీదులు కరెక్టుగా ఉన్నాయా లేదా.. అధికారులు వస్తున్నారా అని చెక్ చేసేందుకు రైతు కమిషన్ చైర్మన్, సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి షాకిచ్చారు. కొందరు అధికారులు అందుబాటులో లేకపోవడంపై చైర్మన్ కోదందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతికి ఎంతో మేలు చేసే బయోగ్యాస్ ప్లాంట్ నడవటం లేదని గుర్తించిన కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మార్కెట్లో కొనుగోళ్లు, విక్రయాలు ఎలా జరుగుతున్నాయో రైతు కమిషన్ సునిశితంగా పరిశీలిచింది. ఇతర వ్యవసాయ మార్కెట్లలో సైతం ఎప్పుడైనా తనిఖీలు జరిగే అవకాశం ఉందని మిగతా మార్కెట్లలో అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు.