తెలంగాణలో నీటి ప్రాజెక్టుల్లో జరిగిన కుంభకోణం కంటే ధరణి కుంభకోణం పెద్దదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధరణి సమస్యలు పరిష్కారం చేసే దమ్ము లేదంటే వెంటనే కేసీఆర్ సీఎంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారాయన. ధరణి కారణంగానే రాష్ట్రంలోని చాలా భూములు కెసిఆర్, ఆయన కుటుంబ కబ్జాలోకి వెళ్తున్నాయని విమర్శించారు. బేరం కుదిరితే లాక్ ఓపెన్ చేస్తున్నారు. లేదంటే క్లోజ్ చేస్తున్నారని నాంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఆక్షేపించారు.
దీన్ని డిజైన్ చేసిన కేసీఆర్ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు రాజేందర్. ధరణి భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిపాలించే నైపుణ్యం లేదు అని రాజీనామా చెయ్యాలన్నారు. భూమి సోషల్ స్టేటస్‌గా భావిస్తారని, ఒక భద్రతని అలాంటి భూమిని ప్రజలకు కాకుండా చేస్తున్నారన్నారు.
శోధించి, సాధించినట్టు గంభీరస్వరంతో భూ రికార్డ్ సరిచేస్తా అని సభలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. భూరికార్డ్ సరిగా ఉంటే జీడీపీ, జీఎస్‌డీపీ 2 అధికంగా ఉంటుందని చెప్తే ప్రజలు అందరు సంతోషించారన్నారు. భూప్రక్షాళన 2 ఏళ్లలో చేసి చూపిస్తా అన్నారని తెలిపారు. ఆ టైంలో జగిత్యాలలో 97శాతం భూ ప్రక్షాళన జరిగిందని కలెక్టర్ చెప్పారన్నారు. ఇది అబద్దమని అప్పుడే తాను చెప్పానన్నారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడానికి అంతా అయిపోయింది కలెక్టర్లు చెప్పారని తెలిపారు. కెసిఆర్ కూడా మెచ్చుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి ఒక నెల జీతం బోనస్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ తర్వాత సమస్యలు రావడంతో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ పాపం అంత రెవెన్యూ వారిదేనని తన మీడియాలో చెప్పించారన్నారు ఈటల. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు వ్యతిరేకంగా వార్తలు రాయించారన్నారు. ప్రజల చేత ఛీ కొట్టించి, బోనుకు ఎక్కుంచారని వివరించారు. ఎలుకల బాధకు ఇళ్ళు తగలబెట్టే పనిచేశారని ఆక్షేపించారు. మహిళా ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి తగబెట్టడనికి కారకుడు కెసిఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2020 అక్టోబర్‌లో ధరణి తీసుకొచ్చి... కలెక్టర్, జెసి, ఆర్డీవోలకు ఉన్న అధికారాలు అన్నీ తీసివేశారని తెలిపారు ఈటల. ఈ అనాలోచిత నిర్ణయాలు కారణంగా లక్షల మంది రైతులు ధరణితో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల ఇబ్బందులతో 24 లక్షల దరఖాస్తు వస్తే కేవలం 6 లక్షలే పరిష్కరించారని ఇంకా 18 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ధరణితో వచ్చిన ఇబ్బందుల కారణంగా ఆదివారం ఒక్కరోజు నలుగురు ఆత్మహత్యయత్నం చేశారని ఆందోళన చెందారు.
రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాల భూమి ప్రగతి భవన్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయంతో.. నిషేధిత జాబితా నుంచి మారిపోయిందని తెలిపారు ఈటల. సీఎం నుంచి సీఎస్‌కి అక్కడి నుంచి కలెక్టర్‌కి చెప్పి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్ పైరవీల నిలయంగా దొంగలకు అడ్డాగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మహబూబ్‌బాద్ జిల్లా నారాయణపూర్ గ్రామం మొత్తం వివాదాస్పద భూజాబితాలో చేర్చారు. దీంతో అక్కడ ఉన్న రైతులకు రైతుబంధు రాక, బ్యాంక్ లోన్లు రాక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ధరణి వివాదాల వల్ల హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు ఈటల. తాతల కాలంలో అమ్ముకున్న భూములు మళ్లీ వారి పేరు మీదకు వచ్చేసరికి... వాటిని ఇతరులకు అమ్ముకోవడంతో వివాదాలు పెరుగాయన్నారు.