రబీలో రైతులకు విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది రాకుండా జగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎంకు... ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై అధికారులు నివేదిక అందించారు. 


2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే.. 2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉందని సీఎంకు వివరించారు అధికారులు. రబీకి సంబంధించి ఇ–క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన అధికారులు, మార్చి మొదటి వారంలో తుది జాబితా ప్రకటిస్తామన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం, ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తి గత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఏడాది మార్చి, మే–జూన్‌ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని అధికారులు తెలిపారు. 2వేల డ్రోన్లను పంపిణీ చేసే దిశగా కార్యాచరణ రెడీ చేసినట్టు వివరించారు. తొలివిడతగా రైతులకు 500 డ్రోన్లు ఇస్తామని తెలిపిన అధికారులు, గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్న అధికారులు, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 


ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ పై సమీక్ష


గతంలో చెప్పినట్టుగా ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కార్యాచరణ, సాయిల్‌ టెస్టింగ్‌ ప్రతి ఏటా ఏప్రిల్‌ లో జరిగేలా ప్లాన్ చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పరీక్ష అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలని, ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై మార్గనిర్దేశం చేయాలని అన్నారు. దీని వలన పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబుల్లో వీటి పరీక్షలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో సాయిల్‌ టెస్ట్‌ పరికరాలు ఉంచాలన్న సీఎం, దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సాయిల్‌ టెస్టింగ్‌ తర్వాత మ్యాపింగ్‌ జరగాలన్నారు సీఎం. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాల మేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతోపాటు, కాలుష్యం తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


ధాన్యం సేకరణపై వివరాలు అందజేత 


ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా గన్నీబ్యాగుల డబ్బులు, రవాణా ఖర్చులు రైతులకు ఇచ్చినట్టు సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే రైతులకు 89శాతం చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. ఇ–క్రాప్‌ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మాండస్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించామని అధికారులు సీఎంకు వివరించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించినందున చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని తెలిపారు.