కేసీఆర్ డెడ్‌లైన్‌పెట్టి గంటలు గడవక ముందే కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. తాము పారాబాయిల్డ్‌ రైస్ కొనడం లేదని తేల్చేసింది. 2021-22 రబీ సీజన్‌కు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం ఇంకా పంపలేదని మరో బాంబు పేల్చింది. ఆ ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నట్టు కేంద్రపౌరసరఫరాల శాఖ కార్యదర్శి పాండే స్పష్టం ప్రకటించారు.


పారాబాయిల్డ్ రైస్‌ ఇవ్వబోమంటూ గతంలోనే తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిందని ఇప్పుడు మళ్లీ గందరగోళం సృష్టిస్తోందన్నారు పాండే. 2021-22 రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపాలని ఎన్నిసార్లు గుర్తు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా పంపించాలన్నారు పాండె. 


గతంతో పోలిస్తే తెలంగాణలో ధాన్యం సేకరణ భారీగా పెంచామన్నారు కేంద్రపౌరసరఫరాల శాఖ కార్యదర్శి పాండే. ఎఫ్‌సీఐ వద్ద ఉన్న నిల్వల ప్రకారం 2020-21లోనే పారా బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవడం సాధ్యపడదని తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ముందే సమాచారం ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అలా చెప్పి కూడా తెలంగాణ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వద్ద మిగిలిన 20 లక్షల టన్నులను పారాబాయిల్డ్ రైస్‌ తీసుకునేందుకు తెలంగాణలో ఒప్పందం చేసుకున్నామన్నారు. అప్పుడే భవిష్యత్‌లో మరోసారి పారాబాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పినట్టు వెల్లడించారాయన. 


అసలు తెలంగాణలో బియ్యం నిల్వలపై సరైనా సమాచారం లేదని ఆరోపించింది కేంద్రం. సరైన రిజిస్టర్, స్టాండర్డ్‌ ఆపరేటింగ్ సిస్టమ్ అమల్లో ఉన్నట్టు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌తో తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ పోర్టల్ ఇంకా ఎందుకు అనుసంధానం చేయకపోవడాన్ని తప్పుపట్టారు కేంద్ర కార్యదర్శి పాండే. తెలంగాణలో పారాబాయిల్డ్ రైస్‌ వినియోగమే ఉండదని... మరి ఎందుకు ఎక్కువ ఆ రైస్‌ ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రైస్‌ ఎక్కువ తీసుకునే కేరళ, జార్ఖండ్‌, తమిళనాడులో వినియోగం తగ్గుతోందన్నారు అందుకే ప్రస్తుతం ఎఫ్‌సీఐ వద్ద ఉన్న నిల్వలు మూడునాలుగేళ్లు సరిపోతాయని తెలిపారు. అప్పటి వరకు రాష్ట్రాల నుంచి పారాబాయిల్డ్‌ రైస్‌ తీసుకునేది లేదన్నారు. ఈ మేరకు రాష్ట్రాల నుంచి అంగీకరం కూడా తీసుకున్నట్టు చెప్పారు పాండే. దేశవ్యాప్తంగా ఇదే రూల్ అమల్లో ఉన్నప్పటికీ ఒక్క తెలంగాణతోనే సమస్య ఉందని చెప్పారు. 


పౌరసరఫరాల మంత్రి పియూష్ గోయల్ మరో అడుగు ముందుకేసి హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన కేసీఆర్ వ్యతిరేక సభ ఫొటోలను రీట్వీట్ చేశారు. రైతులను కేసీఆర్ దగా చేస్తున్నారని బీజేపీ వాళ్లు రైదరాబాద్‌ల రైతు దీక్ష పేరుతో సభ ఏర్పాటు చేశారు.