కేంద్రం నిధులు ఇస్తే వైసీపీ నేతలు తమ ఫోటోలు వేసుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపి నేతలు మరోసారి మండిపడ్డారు. వైసీపీ చర్యలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.


పశ్చిమలో బీజేపి ఆందోళనలు...


పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపి నేతలు తలపెట్టిన ఆందోళనకు పోలీసులు అడుగడుగునా బ్రేక్‌లు వేశారు. కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బిజెపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీని వల్ల కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పాస్ పుస్తకాలపై మీ బొమ్మలేంటి అంటూ బిజెపి శ్రేణులు నినాదాలు చేశారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. భీమవరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.


రైతు వ్యతిరేక వైఖరితో ధాన్యం కొనుగోలు చేయకుండా, ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు సోమువీర్రాజు. తేమ ఉందని ధాన్యం కొనుగోలు చేయకపోవటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తోందని, సివిల్ సప్లై కమిటీ ఛైర్మన్‌గా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మన్ అయిన ఎమ్మెల్యే తండ్రిని నియమించడం దారుణమని కామెంట్‌ చేశారు. వైసీపీ మిల్లర్ల ప్రభుత్వం, తక్షణం సివిల్ సప్లై కమిటీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేసి తొలగించాలని డిమాండ్ చేశారు. పాసుబుక్‌లపై సీఎం జగన్ ఫోటో పెట్టడం పనికి మాలిన ఆలోచన అని వ్యాఖ్యానించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఫైర్ అయ్యారు.


మాండౌస్ తుపాన్ ప్రాంత రైతులను ఆదుకోవాలి 


అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలలోని రైతులకు మాండౌస్ తుపాన్ తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని బీజేపి ప్రదాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి  అన్నారు. చేతికందిన పంట తుపాన్ ధాటికి నీట మునిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి పంట నష్టపోయిన ప్రాంతాల్లో వెంటనే పర్యటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. సంబంధిత జిల్లాల మంత్రులతో, ఇంఛార్జి మంత్రులతో, వ్యవసాయ అధికారులతో పంట నష్టపరిహారానికి సంబంధించిన కమిటీని వెంటనే వేయాలని, కమిటీ వెంటనే ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, రైతులకు, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు.




ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కోతలు పూర్తి చేసుకుని ఆరబోసిన ధాన్యం భీకరమైన వర్షాలకు తడిసి మొలకలొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నారు. వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి, మామిడి వంటి ఉద్యాన పంటలలో చెట్లు నేలకొరిగాయని తెలిపారు. కంది, మిరప, టమాటా వంటి వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. మొత్తంమీద లక్షన్నర ఎకరాలలో వివిధ రకాల పంటలను నష్టపోయారని,నష్టపరిహారాన్ని వీలయినంత త్వరగా అందించి బాధితులను ఆదుకోవాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోందని తెలిపారు.