2021ని ఇండియన్ ఉమన్ స్పేస్ ఇయర్ అంటే బాగుంటుందేమో. వ్యోమగాములుగా, ఇంజనీర్లుగా మన అమ్మాయిలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. ఇటీవలే మన తెలుగమ్మాయి శిరీష బండ్ల వర్జిన్ గెలాక్టిక్ సంస్థ రూపొందించిన యూనిటీ 22 వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లగా.. తాజాగా మరో భారతీయ యువతి సంజల్ గవాండే (30) బ్లూ ఆరిజన్ (Blue Origin) సంస్థ రాకెట్ తయారీలో కీలక పాత్ర పోషించారు. అమెజాన్, బ్లూ ఆరిజన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ జూలై 20న అంతరిక్షయానం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈయన ప్రయాణించనున్న న్యూ షెపర్డ్ (New Shepard) రాకెట్ అభివృద్ధిలో సంజల్ కీలక పాత్ర పోషించారు. అసలు ఎవరీ సంజల్ గవాండే? ఈమెను నాసా ఎందుకు రిజెక్ట్ చేసింది?
- మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో ఉన్న కోల్సేవాడికి చెందిన సంజల్ తండ్రి అశోక్ గవాండే. ఈయన కల్యాణ్ దోంబీవిల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. తల్లి సురేఖ ఎంటీఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి.
- సంజయ్ ముంబై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మాస్టర్స్ చేసేందుకు 2011లో అమెరికాలోని మిషిగన్ టెక్నోలాజిక్ యూనివర్సిటీలో చేరారు.
- అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆసక్తితో మాస్టర్స్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. మాస్టర్స్ పూర్తి చేసిన తరువాత, సంజల్ విస్కాన్సిన్‌లోని మెర్క్యురీ మెరైన్ సంస్థలో మూడేళ్ల పాటు పనిచేశారు.
- తర్వాత కాలిఫోర్నియాలోని ఆరెంజ్ సిటీలో టయోటా రేసింగ్ డెవలప్‌మెంట్‌లో మెకానికల్ డిజైనింగ్ ఇంజనీర్ గా పనిచేశారు.
- అంతరిక్ష రంగంలో పనిచేయాలనే సంకల్పంతో నాసాలో ఇంజనీర్ ఉద్యోగం కోసం సంజల్ దరఖాస్తు చేసుకున్నారు. పౌరసత్వ సమస్యల కారణంగా నాసా ఆమెను రిజెక్ట్ చేసింది.
- నిరాశ పడకుండా ఆమె సీటెల్‌లోని బ్లూ ఆరిజిన్ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సిస్టమ్స్ ఇంజనీర్ కోసం ఇంటర్వ్యూలో విజయం సాధించగా.. ఆమెను న్యూ షెపర్డ్ రాకెట్ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం బ్లూ ఆరిజన్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
సంజల్ చిన్నప్పటి నుంచి నెమ్మదస్తురాలు. చదువులో చాలా చురుగ్గా ఉండేది. తనకు డ్రాయింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ఆడపిల్ల కదా మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎందుకు చేర్పించారు అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఈ రంగంలో ఉండే కష్టతరమైన పనులను మా అమ్మాయి హ్యాండిల్ చేయగలదా? అని నేను కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్నా. కానీ తను మా అంచనాలన్నీ తప్పని నిరూపించింది. ఏరోస్పేస్ రాకెట్లను డిజైన్ చేయాలనే తన కలను సాకరం చేసుకుంది. మేమంతా గర్వించే స్థాయికి ఎదిగింది. - సంజల్ తల్లి సురేఖ
అంతరిక్ష రంగంలో పనిచేయాలన్న నా చిన్ననాటి కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. బ్లూ ఆరిజన్ సంస్థలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను. - సంజల్
అంతరిక్షంలోకి 18 ఏళ్ల కుర్రాడు..
బ్లూ ఆరిజన్ చేపట్టనున్న రోదసీ యాత్రలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో 18 ఏళ్ల కుర్రాడు చేరబోతున్నాడు. న్యూ షెఫర్డ్ నెదర్లాండ్స్‌కు చెందిన ఒలివ్ డేమెన్ (18 ఏళ్లు) తమ ప్రయాణంలో చేరనున్నట్లు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. మిలీయనర్, సోమర్సెట్ క్యాపిటల్ పార్టనర్స్ వ్యవస్థాపకుడు, CEO అయిన జోస్ డెమెన్ కుమారుడే ఈ ఒలివ్. ఈ యాత్ర ద్వారా అంతరిక్షయానం చేసిన అతిపిన్న వయస్కుడిగా ఒలివ్ రికార్డు సృష్టించనున్నాడు. అయితే ఈ అంతరిక్ష యాత్రకు ఒలివ్ ఎంత మొత్తం చెల్లించాడనే వివరాలు వెల్లడి కాలేదు.