దునియా మే కోయీ చీజ్ నహీ బేకార్ థీ! అనే నానుడిని నిజం చేశాడో యువకుడు! ఇసుక నుంచి తైలం తీయవచ్చునో లేదో తెలియదు కానీ, ఇతను మాత్రం చిప్స్ ప్యాకెట్, చాక్లెట్ రేపర్ల నుంచి ఏకంగా సన్ గ్లాసెస్ తయారుచేస్తున్నాడు! వినడానికి ఆశ్చర్యంగా వున్నా, సమాజానికి, పర్యావరణానికి తనవంతుగా మేలుచేసే సోషల్ స్టార్టప్ ఎంచుకున్న తీరు నిజంగా అభినందనీయం!


 


ఎంతసేపూ టెక్నాలజీ కాదు! కాసింత సోషల్ రెస్పాన్సిబిలిటీ వుండాలనే ధ్యాస వున్న అతికొద్ది మంది యువకుల్లో అనిష్ మల్పానీ ఒకరు! ఒకసారి ముంబైలోని చెంబూర్ లాండ్ ఫిల్ ఏరియా నుంచి వెళుతుంటే, గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న చెత్తను చూసి చలించిపోయాడు! అందులో రీ సైకిల్ అయ్యేది తక్కువ! వందల సంవత్సరాలు భూమ్మీద ఉండిపోయే వేస్టేజీనే ఎక్కువ! ఇలాంటి వ్యర్ధాలకు బ్రాండ్ వాల్యూ తీసుకొస్తే ఎలా వుంటుందనే ఆలోచన నుంచే పుట్టిందే ఆశయ స్టార్టప్! అతను అమెరికా నుంచి వచ్చంది కూడా సమాజానికి ఏదో చేయాలనే సంకల్పంతోనే! ముఖ్యంగా పేదరిక నిర్మూలనపై తనకంటూ ఒక ఎయిమ్ ఉంది! అలాంటి ఐడియాలజీకి ఈ వేస్టేజీ ఒక ఊతంగా దొరికింది!


 


దుబాయ్‌లో పెరిగిన మల్పాని ఫైనాన్స్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చదవడానికి యుఎస్‌కి వెళ్లాడు. కార్పొరేట్ ఉద్యోగం, గ్రీన్ కార్డ్ లైఫ్‌, సబర్బన్ లైఫ్‌! ఇదీ వాస్తవంగా మల్పానీ ఊహించిన జీవితం! కానీ తలచిందొకటి, జరిగింది మరొకటి! అనుకున్న టార్గెట్ సరిగా టేకాఫ్ కాలేదు! ఒకరకమైన నిరుత్సాహం ఆవహించింది! ఆ నైరాశ్యంలోనుంచే ఒక మెరుపులాంటి ఆలోచన పుట్టింది. నేను నా కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే, సమాజహితం కోసం పాటు పడితే ఎలా వుంటుంది అనే కోణంలో మేథస్సు రంగరించాడు. అర్ధవంతమైన జీవితం అందులోనే ఉందనే సూక్ష్మాన్ని గ్రహించాడు.


 


ఏమాత్రం ఆలోచించకుండా ఇండియాకి తిరిగివచ్చాడు. ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి ఒక సోషల్ ఎంటర్ ప్రైజెస్‌ లో పనిచేయాలని అనుకున్నాడు. ఆ క్రమంలోనే చిప్స్ ప్యాకెట్ల నుంచి సన్ గ్లాసెస్ తయారు చేసే ఆశయ అనే కంపెనీకి పునాది పడింది. చాక్లెట్ రేపర్లు, చిప్స్ ప్యాకెట్లు, మల్టీ-లేయర్డ్ ప్యాకేజింగ్ వ్యర్థాలతో పనికొచ్చే ప్రాడక్ట్ తయారు చేయాలనేది స్టార్టప్ ఉద్దేశం.  


 


బేసిగ్గా ఇండియాలో  50-80% వ్యర్థాలు రీసైకిల్ కావు! ఇదొక సంక్లిష్ట సమస్య! అంతుచిక్కని లోతు. అందుకే ఒక టీం తయారుచేసుకున్నాడు. వ్యర్థాల విలువను పెంచే మార్గాలను ఆ టీం అన్వేషించింది. ఇప్పటికే, PET సీసాలు, HDP సీసాలు రీసైకిల్ అవుతున్నాయి. కానీ ఎవరూ చేయని సమస్యలపై పనిచేయడమే మల్పానీ లక్ష్యం. అందుకే MLPని ఎంచుకున్నాం అంటాడాయన. పుణెలో ఏర్పాటుచేసిన చిన్న ల్యాబ్ నుండి పరిశోధన మొదలైంది. మొదటి ఏడాదిన్నర MPL నుంచి హైక్వాలిటీ మెటీరియల్‌ తెచ్చే టెక్నాలజీపై పనిచేశారు. ఒకటి కాదు రెండు కాదు. దాదాపు 1,000 ప్రయోగాలతో మొదటి సంవత్సరం గడిచిపోయింది. అలా తమ ఐడియాకు రూపం అంటూ వచ్చింది. ఫోకస్ గ్రూప్‌లతో కలిసి పని చేయడం, గంటల కొద్దీ మేధోమథనం తర్వాత, ఆశయ బృందం 400 ఉత్పత్తుల జాబితాను రూపొందించింది. ఆ షార్ట్ లిస్ట్ 70కి చేరింది. వాటిల్లో అన్నిటికంటే సన్‌గ్లాస్ ఐడియా బాగా కనెక్టయింది. మార్జిన్ కూడా బాగా వస్తుందని అర్ధమైంది.


 


ఫైనల్‌ గా ఆశయ స్టార్టప్ తన పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది! చిప్స్ ప్యాకెట్ నుంచి సన్ గ్లాసెస్ తయారీ!  ట్విట్టర్, లింక్డ్‌ ఇన్‌ లో ప్రకటన. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో 500లకు పైగా ఆర్డర్లను అందుకున్నారు. ఈ కంపెనీ తయారుచేసే UV పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ చాలా మన్నికైనవి. ధర సుమారు రూ.1,000. లైట్ వెయిట్. 26 గ్రాముల బరువు ఉంటాయి. యునిసెక్స్ డిజైన్‌. ప్రస్తుతానికి చార్ కోల్, నలుపు రంగులో తీసుకొచ్చారు. ఐదు రీసైకిల్ చిప్స్ ప్యాకెట్ల నుంచి ఒక సన్ గ్లాస్ తయారవుతుంది. ఒక రోజులో 30 నుంచి 50 కళ్లద్దాలు తయారు చేస్తున్నారు. వ్యర్థాలను సేకరించేవారికి ఉపాధిని కల్పించడం ఈ స్టార్టప్ మరో ఉద్దేశం. అంతేకాదు, వీరికి వచ్చిన ఆదాయంలో 10శాతం వ్యర్థాలను సేకరించేవారి పిల్లల చదువుకు కేటాయిస్తారు. రేపర్లు తీసుకొచ్చేవారికి బయట మార్కెట్‌ కంటే ఎక్కువే ఇస్తున్నారు. ఈ టెక్నాలజీని ల్యాబ్ నుంచి మార్కెట్‌కి తీసుకెళ్లడం తమ తదుపరి లక్ష్యం అంటున్నారు మల్పానీ అండ్ కో!