గత కొంత కాలంగా టమాటా ధర రోజురోజుకూ పెరిగిపోతుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూరగాయలు ధరలు విపరీతంగా పెరగడంతో.. సామాన్య ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు.
వర్షాల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం కల్గడంతో మెట్రో నగరాల్లో టమాటా ధరలు మరింత అధికం అయ్యాయి.
కోల్ కతాలో కిలో టమాటా ధర రూ.155కు చేరగా.. ముంబయిలో రూ.58, ఢిల్లీలో రూ.110, చెన్నైలో రూ.117గా టమాటా ధరలు ఉన్నాయి.
కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో టమాటా సరాసరి ధర కిలోకు రూ.83.29గా ఉంది.
బీహార్ రాజధాని పాట్నాలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు కిలో రూ.60 చొప్పున లభిస్తున్నాయి.
ఇదొక్కటే కాదు పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా కూరగాయల ధరల విపరీతంగా పెరిగాయి. క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ నుంచి బెండకాయ వంటి కూరగాయల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.
ఒడిశాలో గత 15 రోజులుగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమోటాలు కిలో రూ.140 నుంచి 160 మధ్య ఉండగా, పచ్చిమిర్చి కిలో రూ.200 పలుకుతోంది. అల్లం ధర కిలో రూ.300 పలుకుతోంది.
ఢిల్లీలోని సఫాల్ స్టోర్‌లో కూడా టమాటా కిలో రూ.129 పలుకుతుండడంతో ఇక్కడి ప్రజలు ఈ కూరగాయల కొనుగోలును తగ్గించారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో టమాటా ధర కిలో రూ.150కి చేరుకుంది. పెరుగుతున్న ఏదో రకంగా సామాన్యులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడం, 30 శాతం పంట దిగుబడి తక్కువగా ఉండటంతోనే ధరలు పెరుగుతున్నాయని రైతులు అంటున్నారు.