భోగిమంటలు అంటే ఇంట్లో ఉన్న చెత్తా చెదారానికి నిప్పు పెట్టడం కాదు...
భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా వెలిగించాలంటారు.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తే భోగి మంట వెలిగించాలి...అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెబుతారు పెద్దలు.
ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వాడేవారు. ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు.
పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
పిడకలు, చెట్టు బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసేవారు.
కాలం మారింది భోగిమంట కూడా ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, రబ్బర్ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. అవి సరిగా మండటం లేదని పెట్రోలు, కిరోసిన్ పోస్తున్నారు.
రబ్బర్, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్ నుంచి వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా ఎంతో హాని కలుగుతోంది.
పిడకలు, చెట్టు బెరడు, కలప లాంటివి వేసుకుని భోగిమంట వేయకపోయినా పర్వాలేదు...ప్లాస్టిక్, చెత్తా-చెదారంతో భోగిమంట వేసి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడుచేయొద్దంటున్నారు పండితులు.