Rupee Vs Dollar: రూపాయికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టున్నాయి! డాలర్‌తో పోలిస్తే మంగళవారం రికార్డు స్థాయిలో పెరిగింది.

ఏడాదిలో ఒకరోజు అత్యధిక లాభాలను నమోదు చేసింది.

భారత స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు తిరిగి వస్తుండటంతో మంగళవారం 51 పైసలు పెరిగి రూ.79.45 వద్ద ముగిసింది.

2021, ఆగస్టు 27 తర్వాత ఒక్క రోజులో గరిష్ఠ పెరుగుదల ఇదే కావడం గమనార్హం.

ద్రవ్యోల్బణం పెరుగుదల, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా డాలర్లకు గిరాకీ పెరగడంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైంది.

ఏడాది క్రితం రూ.74-75 స్థాయిల్లో ఉన్న విలువ కొన్ని రోజుల క్రితం ఆల్‌టైమ్‌ కనిష్ఠమైన రూ.80.12కు చేరుకుంది. మళ్లీ అదే రోజు కాస్త పుంజుకొని రూ.79.96 వద్ద ముగిసింది.

ఆగస్టులోనే 6 బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌ఐఐలు ఇండియన్‌ ఈక్విటీల్లో కొనుగోళ్లు చేపట్టారు. 2020 డిసెంబర్‌ తర్వాత ఇదే అత్యధిక కొనుగోళ్లు కావడం ప్రత్యేకం.

విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వ బాండ్లనూ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో వారు నెట్‌ బయ్యర్లుగా అవతరించడం ఆగస్టులోనే తొలిసారి.

ఇదే సమయంలో పదేళ్ల బాండ్‌ యీల్డులు 6 బేసిస్‌ పాయింట్లు తగ్గి 7.1893 శాతంగా ఉండటం గమనార్హం.

కమోడిటీ ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో రూపాయి విలువ మరింత పెరుగుతుందని హెచ్‌ఎస్‌బీసీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.