వర్షాకాలంలో పిల్లలకు ఎక్కువగా వచ్చే వ్యాధులివే.. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు

Published by: Geddam Vijaya Madhuri

జలుబు, దగ్గు

వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. పిల్లల్లో ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, స్వల్ప జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

వైరల్ ఫీవర్

ఈ సీజన్‌లో పిల్లల్లో వైరల్ జ్వరాలు సాధారణం. అధిక జ్వరం, శరీర నొప్పులు, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డెంగ్యూ

దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.

మలేరియా

వర్షాల కారణంగా దోమల పెరుగుదల ఎక్కువవుతుంది. మలేరియా వచ్చినప్పుడు చలి వణుకుతో కూడిన జ్వరం, చెమటలు, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి.

టైఫాయిడ్

కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలిక జ్వరం, కడుపు నొప్పి, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

డయేరియా (విరేచనాలు)

వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం కారణంగా విరేచనాలు ఎక్కువగా వస్తాయి. పిల్లల్లో డీహైడ్రేషన్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు

అధిక తేమ, చెమట వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. దురద, ఎర్రటి మచ్చలు, చర్మం పొలుసుల్లా ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కళ్ల కలక

వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయి. కళ్ల ఎర్రబడటం, దురద, నీరు కారడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు

వర్షాకాలంలో తేమ, ఫంగస్, దుమ్ము కారణంగా ఆస్తమా ఉన్న పిల్లల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరగవచ్చు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లలు శుభ్రమైన నీరు మాత్రమే తాగేలా చూడాలి. దోమలు పెరగకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. చేతులు తరచూ కడుక్కోవడం అలవాటు చేయాలి.

జ్వరం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.