త్వరలో యాపిల్ ఐఫోన్లకు కూడా యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించనున్నారు. చిన్న ఎలక్ట్రానిక్ డివైస్‌లు అన్నిటికీ కామన్ చార్జర్ ఉండాలని ఈయూ ఆదేశాలు జారీ చేసింది. ఐఫోన్లను యూరోప్‌లో విక్రయించాలంటే 2024 నుంచి ఈ మార్పు చేయకతప్పదు. ప్రస్తుతం ప్రపంచంలో యూఎస్‌బీ టైప్-సీ, లైట్‌నింగ్ పోర్టులకు కలిపి 100 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఎలక్ట్రానిక్ వేస్ట్‌ను తగ్గించాలని ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారులకు మరిన్ని చాయిస్‌లు కూడా లభించనున్నాయి. 2014లో యూఎస్‌బీ టైప్-సీ వచ్చేవరకు మైక్రో యూఎస్‌బీ పోర్టు ట్రెండింగ్‌లో ఉంది. ఈ సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్‌లో కూడా లైట్‌నింగ్ పోర్టునే అందించారు. 2015లోని మ్యాక్‌బుక్, 2018లోని ఐప్యాడ్‌ల్లో యూఎస్‌బీ టైప్-సీని అందించారు. 2023లో వచ్చే ఐఫోన్ 15 లేదా 2024లో వచ్చే ఐఫోన్ 16ల్లో టైప్-సీ పోర్టు ఉండనుంది.