వేరుశెనగపలుకులు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చాలామంది డయాబెటిస్‌తో బాధపడేవారు వేరుశెనగపలుకులు తినేందుకు ఇష్టపడరు. నిజానికి డయాబెటిక్ రోగులు కూడా పల్లీలు తినొచ్చు. మితంగా తిన్నంత వరకు ఎలాంటి సమస్యా రాదు. పల్లీలు కూడా నట్స్ కోవలోకే వస్తాయి. నిజానికి బాదం, వాల్‌నట్స్ కన్నా కూడా పల్లీల వల్లే ఆరోగ్యం ఎక్కువ. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంతేకాదు రక్తంలో గడ్డలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. పల్లీలు తినడం వల్ల కేలరీలు అధికంగానే శరీరానికి అందుతాయి. అలాగే కొవ్వు కూడా ఉంటుంది. కానీ బరువు పెరగరు. అదే వీటి ప్రత్యేకత. రోజూ పల్లీలు తినేవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. పల్లీలలో మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నిషియం, కాపర్, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. వేరుశెనగ పలుకుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. దీనివల్ల డయాబెటిక్ రోగులు తినొచ్చు. పల్లీలు తినే మహిళలు టైప్ 2 డయాబెటిస్ బారిన తక్కువగా పడతారని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి.