హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ఇంకా కలకలం రేపుతోంది. వాంకిడి మండలంలోని దాబా శివారులో గత రెండు రోజుల క్రితం పశువులపై పెద్దపులి దాడి చేసింది. దీంతో కాపర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం ఆసిఫాబాద్ చంద్రపూర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి పక్కనే పెద్దపులి అక్కడి స్థానికులకు కనిపించింది. ఆదివాసీల దేవస్థానపు జెండా వద్ద అక్కడే తిరుగుతూ అక్కడి నుండి అటవీ ప్రాంతం వైపు పెద్దపులి వెళ్ళింది. పెద్దపులిని చూసిన స్థానికులు వాహనంలో నుండి సెల్ ఫోన్ ద్వారా పెద్దపులి వీడియోను చిత్రీకరించారు. తమకు పులి కనిపించిందని వారి మిత్రులకు సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకోవైపు కేరామరి ప్రాంతంలోనూ మరొక పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆ పులి ఇప్పుడు అనార్ పల్లి , దేవాపూర్, అడ్డేసరా, చింతకర్ర, సోమ్లానాయక్ తండా మార్గం మధ్యలో సంచరిస్తుందని, పెద్దపులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పంట చెలలో విద్యుత్ కంచెలను తొలగించేలా.. వారికి అవగాహన కల్పిస్తూ... పులి సంచరిస్తున్న తరుణంలో వ్యవసాయ రైతులు.. పత్తి ఏరే కూలీలు.. జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గుంపులుగా తమ పనులు చేసుకోవాలని అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.