ఇంకా చల్లారని రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం
హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో పాలిథిన్ సంచులు తయారు చేసే ఓ పరిశ్రమలో మంటలు 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్‌కు సంబంధించిన ముడిసరకు ఉండటంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. ముడి సరకులో మండే స్వభావం ఉన్న పదార్థాలు ఉండడంతోనే పేలుడు సంభవించి.. ఓ దశలో ఏకంగా రెండు వందల మీటర్లకు పైగా ఎత్తుకు మంటలు ఎగిసిపడ్డాయి. కంపెనీ లోపల ఉన్న ఆయిల్ ట్యాంకర్లు పేలడంతోనే భారీ మొత్తంలో మంటలు పైకి ఇక చిమ్ముతున్నాయని సిబ్బంది తెలిపారు. నవంబర్ మధ్యాహ్నం 1 గంటలకు మొదలైన ఫైర్, బుధవారం 7 గంటలు అవుతున్నా మంటలు వస్తూనే ఉన్నాయి. బిల్డింగ్ పూర్తిగా దగ్ధమైపోయింది. బుధవారం మధ్యాహ్నానికి మంటలు పూర్తిగా ఆర్పే అవకాశముంది. నిన్న 7 ఫైరింజిన్లు, 40 వాటర్ ట్యాంకర్లు వాడినా మంటలు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో పూర్తిగా భవనం పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ముడి సరకులు పూర్తిగా మంటల్లో ఉండటంతో.. పక్కన ఉన్న కంపెనీలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.