గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!
నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ ప్రజలు చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తంగా మారింది. నవంబర్ 26 ఉదయం నుంచి కంటిన్యూగా దిల్వార్పూర్ లో ధర్నా కొనసాగుతుంది. నిర్మల్ భైంసా జాతీయ రహదారి పై ఉదయం నుంచి మర్నాడు వరకూ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఆందోళనకారులతో మాట్లాడేందుకు వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణిని కూడా గ్రామస్తులు అడ్డుకొని ఆమెను, ఆమె వాహనాన్ని నిర్భందించారు. ఆర్డీవో కారు దహనానికి కూడా కొందరు యత్నించారు. రాత్రి అయినా కూడా చలి మంటలు వేసి మరీ ధర్నా కొనసాగించారు. దిలావార్ పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తుండగా.. స్పందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.. దీనిపై నివేదికను సీఎంవోకు అందజేస్తామని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు రహదారిపైనే వంటావార్పు నిర్వహించి.. అక్కడే భోజనం చేశారు. చీకటిపడటంతో సెల్‌ఫోన్ల వెలుతురులో నిరసన కొనసాగించారు. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు.