మామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసన
వరంగల్ లో మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వెట్టిచాకిరి చేయిస్తూ.. కనీసం సెలవులు ఇవ్వకుండా కుటుంబానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఆర్టీవో కార్యాలయం జంక్షన్ నుంచి మామునూర్ బెటాలియన్ వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డు పై బైఠాయించారు. కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఏక్ పోలీస్ సర్వీస్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీస్ లు ఈ ఆందోళనను అడ్డుకున్నారు. మామునూర్ 4 వ బెటాలియన్ లో కానిస్టేబుల్ నుంచి ఎఎస్సై వరకు సుమారు 15 వందల మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాలి. దీంతో తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంటివద్ద ఉండాల్సిన పరిస్థితి. భార్య పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగానే వాళ్ల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశాయి. ప్లకార్డ్‌లు పట్టుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు కుటుంబ సభ్యులు.