KTR Protest At Charminar | తెలంగాణ రాజముద్ర మార్పుపై కేటీఆర్ ఆందోళన
కేసీఆర్ పై కక్షతో తెలంగాణ రాజముద్ర మార్పుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే. చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం మూర్ఖపు నిర్ణయమేనని విమర్శించారు. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టారు.
తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రతిపాదన దృష్ట్యా.. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు గురువారం ఉదయం చార్మినార్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఇతర పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చార్మినార్ వద్ద నిరసనకు దిగారు. అటు, కాకతీయ కళాతోరణం వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. భాగ్యనగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.