కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీ
హైదరాబాద్ లో ఓ బంగారు వ్యాపారి ఇంట్లో సినీ ఫక్కీలో రూ.2 కోట్ల విలువ చేసే బంగారం చోరీకి గురైంది. మాస్కులు ధరించిన దుండగులు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో తుపాకులు, కత్తులతో ఇంట్లోకి చొరబడి వ్యాపారి, అతని కుటుంబ సభ్యులను బెదిరించి సొమ్మంతా దోచుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారి ఇంట్లో బంగారం భారీగా ఉంటుందన్న సమాచారం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇంద్రజిత్, రంజిత్ అన్నదమ్ములు కుటుంబ సభ్యులతో పదేళ్ల క్రితం నగరానికి వచ్చి.. పనివాళ్లతో అర్డర్లపై బంగారు ఆభరణాలను తయారు చేయించి జ్యూవెలరీ షాప్‌లకు పంపిస్తుంటారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పదిమంది దుండగులు ఇంద్రజిత్ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ పెద్దగా సొత్తు కన్పించకపోవడంతో అతన్ని తీసుకొని పక్కనే మరో ప్లాట్‌లో ఉన్న రంజిత్ వద్దకు తీసుకువచ్చారు. తలుపు కొట్టడంతో వారు కిటికీలోంచి బయటికి చూశారు. తలుపు తీయకుంటే మీ తమ్ముడిని చంపేస్తామని తుపాకీ తలకు పెట్టడంతో అతను తలుపులు తెరిచి బెడ్‌రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లిన అగంతుకులు రంజిత్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో అతని కుడి చేతికి గాయమైంది. అతని భార్య అనితను బంగారం ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరించడంతో లాకర్ ఓపెన్ చేసి అందులోని రెండున్నర కిలోల బంగారాన్ని వారికిచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు జాగిలాలను పిలిపించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. చుట్టుపక్కల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.