పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

పెద్దపల్లిలోని రాఘవాపూర్‌ వద్ద ఐరన్ కాయిల్స్ లోడ్‌తో వెళ్తున్న  గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే వ్యాగన్‌లు పడిపోవడం వల్ల మూడు రైల్వే లైన్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పట్టాలతో పాటు కరెంట్ పోల్స్ కూడా విరిగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు..రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్‌లను నిలిపివేశారు. ఎనిమిది వ్యాగన్లను రామగుండంకు తరలించారు. గూడ్స్ రైలు నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగనట్టు వెల్లడించారు. ట్రాక్ పునరుద్ధరణకు కనీసం 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. రైల్వే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రైల్వే ట్రాక్‌లు దెబ్బ తినడం వల్ల రామగుండానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం అక్కడ ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కరెంట్ పోల్స్ విరిగిపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ట్రైన్స్ రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola