నిర్మల్‌లో పెద్ద పులి భయం, ఆవుని చంపడంతో గ్రామస్థుల్లో ఆందోళన
నిర్మల్ జిల్లా మామడ రేంజి పరిధిలోని భర్కరేగిడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. రెండు రోజుల క్రితం నిర్మల్ ఘాట్ దాటి మామడ రేంజి పరిధిలోకి సంచరించిన పెద్దపులి..భర్కరేగిడి అటవీ ప్రాంతంలోని పత్తి చేనుకు సమీపంలో ఓ ఎద్దు పై దాడి చేసి హతమార్చింది. స్థానిక రైతులు విషయం తెలుసుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో మామడ, తాండ్ర, పెంబి మూడు రేంజ్ల అధికారులు, బాసర జోన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, టాస్క్ ఫోర్స్ టీమ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పులి దాడి చేసి హతమార్చిన ఎద్దును పరిశీలించారు. పత్తి చేనులో సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను సేకరించారు. ఆ ప్రాంతంలో రెండు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమీప గ్రామాలకు వెళ్లే రహదారిని మూసివేశారు. ఆ ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని సమీప గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపే పొలం పనులు చూసుకోవాలని రైతులకు సూచించారు.