వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డి జోక్యం ఉందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 50 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 16 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లందరినీ కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఈ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటుకి సంబంధించిన భూసేకరణపై..అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్‌జైన్ సహా మరి కొంత మంది అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన తరవాత అర్ధరాత్రి పోలీసులు వెళ్లి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇంటర్నెట్ సేవల్నీ ఆపేశారు. ఆ తరవాత ఇళ్లలోకి వెళ్లి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వాళ్లని విడిచిపెట్టారు. ఈ ఘటన రాజకీయంగానూ అలజడి సృష్టించింది. ప్రభుత్వ వైఫల్యానికి ఈ దాడే నిదర్శనమని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. అటు ప్రభుత్వం మాత్రం ఇది ప్రతిపక్ష కుట్ర అని తేల్చి చెబుతోంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బొమాని సురేశ్‌..కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డితో కలిసి దిగిన పాత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola