161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్
యంగ్ గన్ యశస్వి జైశ్వాల్ ఆస్ట్రేలియాలో రెచ్చిపోయాడు. ఈ ఏడాది టెస్టుల్లో తను ప్రదర్శిస్తున్న ఫామ్ ను కొనసాగిస్తూ కంగారూల గుండెల్లో కంగారు పుట్టించారు. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయితే యశస్వి డకౌట్ గా వెనుదిరిగాడు. అలాంటిది మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ కూడా 104 పరుగులకే ఆలౌట్ కావటంతో...సెకండ్ ఇన్నింగ్స్ కి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి..దుమ్ము రేపాడు. కేఎల్ రాహుల్ తోడుగా 201 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ నెలకొల్పిన జైశ్వాల్..ఆస్ట్రేలియాలో ఆ ఘనత సాధించిన తొలి భారతీయఓ పెనర్లుగా రాహుల్ తో కలిసి రికార్డును నెలకొల్పాడు.ఈ క్రమంలో కెరీర్ లో నాలుగో సెంచరీని కంప్లీట్ చేశాడు. అప్పర్ కట్ షాట్ తో సిక్స్ కొట్టి ఈ సెంచరీని జైశ్వాల్ పూర్తి చేయటం విశేషం. గాల్లోకి చేతులు చాచి తన ఐకాన్ పోజ్ తో సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన మూడో భారత బ్యాటర్ గా నిలిచాడు జైశ్వాల్. పెర్త్ లో దుమ్ములేపిన జైశ్వాల్ మొత్తం 161 పరుగులు చేసి మిచ్ మార్ష్ బౌలింగ్ లో స్మిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన కెరీర్ లో జైశ్వాల్ కొట్టిన నాలుగు సెంచరీలు భారీవే కావటం విశేషం. నాలుగు సార్లు 150 కి పైగా పరుగులు చేశాడు. రెండుసార్లు డబుల్ సెంచరీలు కొట్టాడు. మొత్తం మీద స్టార్క్, హేజిల్ వుడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ లియాన్ లాంటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని తన ఫామ్ కి తిరుగులేదని నిరూపించాడు జైశ్వాల్.