Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
దేశవాళీ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ టీమ్ లో15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, డిప్యూటీగా వైభవ్‌ను ఎంపిక చేశారు. అయితే ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డాడు. "సెలెక్టర్లు వైభవ్‌ను ప్రోత్సహించాలని, అతని ఆటతీరుకు బహుమతి ఇవ్వాలని భావించి ఉండవచ్చు. ఇది ఆ కుర్రాడికి మంచి గుర్తింపునే తెస్తుంది. కానీ, అతని ఫస్ట్ క్లాస్ రికార్డులు అంత గొప్పగా ఏమీ లేవు. అదే సమయంలో జట్టులో సీనియర్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడనే విషయాన్ని సెలెక్టర్లు మర్చిపోకూడదు. ఎంతో అనుభవం ఉన్న ఈశ్వరన్‌కు ఈ బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేది" అని జాఫర్ పేర్కొన్నాడు.
ఇంతటి అనుభవం ఉన్న ఆటగాడు ఉండగా, ఎలాంటి అనుభవం లేని 15 ఏళ్ల కుర్రాడికి డిప్యూటీ రోల్ ఇవ్వడంపై చర్చ జరగడం సహజమేనని జాఫర్ అన్నాడు. అయితే, ఈ విషయాన్ని అంతగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశాడు. జట్టును ఎలాగో ఇషాన్ కిషన్ నడిపిస్తాడు కాబట్టి, దీన్ని ఒక వివాదంగా మార్చకూడదని, కానీ సీనియర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.