రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు
క్రికెట్ అంటేనే అంత. ఎవరు ఎప్పుడు హీరోలవుతారో ఎవ్వరికీ తెలియదు. మనలో టాలెంట్ ఉండాలి. దానికి తగిన సమయం రావాలి..ఓ అండ ఉండాలి అంతే. స్టార్ ప్లేయర్ పుట్టుకొచ్చేస్తాడు. ఇప్పుడు టీమిండియాలో తిలక్ వర్మను చూస్తే ఇదే అనిపిస్తోంది. ఇన్నాళ్లూ మిడిల్ ఆర్డర్ లో ఆడుకుంటూ పర్లేదు కుర్రోడు మంచి టాలెంటెడ్ ప్లేయరే అన్న ముద్ర తెచ్చుకున్న తిలక్ వర్మ...ఇప్పుడు వీడు టాలెంటెడే కాదు డేంజరస్ ప్లేయర్ అనిపించేలా విరుచుకుపడుతున్నాడు. దానికి రీజన్ సౌతాఫ్రికా గడ్డపై సౌతాఫ్రికా మీద రెండు వరుస సెంచరీలు బాదేయటమే. తిలక్ వర్మను మిడిల్ ఆర్డర్ నుంచి వన్ డౌన్ కు ప్రమోట్ చేస్తూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం తిలక్ వర్మ ఎంత డేంజరస్ ప్లేయరే తెలిసేలా చేసింది. సౌతాఫ్రికా మీద మూడో టీ20లో 56 బంతుల్లో 107పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు తిలక్ వర్మ. దీని కోసం సూర్యా భాయ్ తన ప్లేస్ నే త్యాగం చేసుకున్నాడు. తనను డీమోట్ చేసుకుని తిలక్ కు తన ప్లేస్ అయిన వన్ డౌన్ ఇవ్వటం ద్వారా తిలక్ వర్మలో ని ఎబిలిటీస్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి స్కోప్ ఇచ్చాడు. అది సక్సెస్ అవ్వటంతో నిన్న జరిగిన చివరి టీ20 మ్యాచ్ లోనూ వన్ డౌన్ లోనే ఆడించాడు. ఎక్కువ సేపు క్రీజులో ఉండటం...తిలక్ కు పిచ్చ కాన్ఫిడెన్స్ ఇచ్చిందో ఏమో నిన్న ప్రొటీస్ టీమ్ కు చుక్కలు చూపించాడీ హైదరాబాదీ. కేవలం 47 బాల్స్ లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులు బాదేసి తన కెరీర్ బెస్ట్ ను నమోదు చేశాడు. సౌతాఫ్రికా మీద సౌతాఫ్రికా సాయిల్ లో వరుసగా రెండు టీ20 సెంచరీలు బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. సంజూ తో కలిసి మ్యాచ్ ను గెలిపించటంలో కీ రోల్ పోషించటంతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డునూ అందుకున్నాడీ తెలుగు తేజం. అచ్చం 2013లో రోహిత్ శర్మ కోసం ధోని కూడా ఇదే చేశాడు. మిడిల్ ఆర్డర్ లో ఫెయిలవుతున్న రోహిత్ ను ఓపెనర్ గా ప్రమోట్ చేశాడు మాహీ. ఇకంతే మిగిలింది చరిత్ర. ఇటు జాతీయ జట్టుకు హిట్ మ్యాన్ గా, అటు ఐపీఎల్ లో నాయకుడిగా మారిపోయిన రోహిత్..కెరీర్ చరమాంకం చేరుకునేప్పటికి లెజెండ్ గా మారిపోయాడు. మరి ఇప్పుడు సూర్యా భాయ్ త్యాగంతో తిలక్ వర్మ సూపర్ స్టార్ ప్లేయర్ పుట్టుకొచ్చాడా లెట్స్ టైమ్ విల్ డిసైడ్.