T20 Worldcup 2024 Group D Preview | టీ20 వరల్డ్ కప్ గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక
టీ20 ప్రపంచకప్‌లో ‘డి’ కాస్త డేంజరస్ గ్రూపర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య టాప్-2 కోసం పోటీ జరిగేలా ఉన్నట్లు కనిపించినా... నెదర్లాండ్స్, నేపాల్ జట్లను పసి కూనలు అనుకోలేం. 2014 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు సైతం షాకిచ్చిన చరిత్ర నెదర్లాండ్స్‌కు ఉంది. ఈ గ్రూప్‌లో ఉన్న టీమ్స్ ఏంటి? వాటి బలాలేంటి?
ప్రపంచకప్‌ల్లో దక్షిణాఫ్రికా పేరు చెప్పగానే దురదృష్టమే గుర్తొస్తుంది. కచ్చితంగా గెలిచే పరిస్థితుల్లో కూడా బోల్తా పడ్డ సందర్భాలు లెక్కలేనన్ని. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు. 2009 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరడమే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా జట్టు అత్యుత్తమ ప్రదర్శన. మార్‌క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ప్రస్తుతం గ్రూప్-డిలో బలమైన జట్టు. చూడటానికి మాత్రం టీమ్ నిండా స్టార్లే కనిపిస్తున్నారు. బ్యాటింగ్‌లో సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ కంట్రోల్ చేయగల మిల్లర్, క్లాసెన్‌లతో పాటు బంతితో చెలరేగే కగిసో రబడ, ఆన్రిచ్ నోకియా పెద్ద బలం. ఓపెనర్ రీజా హెండ్రిక్స్, మిడిలార్డర్ బ్యాటర్ స్టబ్స్ మంచి ఫాంలో ఉన్నారు. స్టబ్స్ హిట్టింగ్ ఏ లెవల్‌లో ఉందో ఇప్పటికే ఐపీఎల్‌లో చూశాం. ఎక్స్‌పీరియన్స్‌డ్ బ్యాటర్లు మార్‌క్రమ్, డికాక్ ఫామ్‌లో లేకపోవడం ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు అతి పెద్ద సమస్య. దక్షిణాఫ్రికా గ్రూప్ దశ దాటినా సెమీస్ చేరడం మాత్రం అంత తేలిక కాదు.