Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
ఐపీఎల్ 2026 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయంతో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో గెలవాల్సిన రెండు మ్యాచ్‌లను చేజేతులా చేజార్చుకోవడం, ప్లేయర్స్ గాయాలే తమ కొంపముంచాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
మ్యాచ్ తర్వాత రుతురాజ్ మాట్లాడుతూ.. "గుజరాత్ మాపై అద్భుత ప్రదర్శన చేసింది. మా బౌలింగ్ పవర్‌ప్లేలో అస్సలు బాలేదు. వారిని 200 లోపే కట్టడి చేసే అవకాశం ఉన్నా విఫలమయ్యాం. 230 భారీ లక్ష్యమైనా స్వేచ్ఛగా ఆడాలనుకున్నాం కానీ కుదరలేదు. టోర్నీ మొదట్లోనే మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం. ఆ తర్వాత ఫామ్‌లోకి వచ్చినా.. ముఖేష్ చౌదరి, ఓవర్టన్ వంటి కీలక బౌలర్లు గాయపడటం మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసింది. అలాగే హైదరాబాద్‌పై చేతిలో ఉన్న రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం టోర్నీలోనే మాకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ రెండు గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది" అని తెలిపాడు.
టీమ్ ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉందని, రహానే, అంబటి రాయుడు లాంటి సీనియర్ల లోటు స్పష్టంగా తెలిసిందన్నాడు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై స్పందిస్తూ.. "ధోనీ వచ్చే ఏడాది ఆడతారా లేదా అనేది మీకు, నాకు వచ్చే ఏడాదే తెలుస్తుంది. క్రీజులో కేవలం ధోనీ నిలబడితేనే చివరి ఓవర్లలో మ్యాచ్ మొత్తం మారిపోతుంది. వచ్చే సీజన్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం" అంటూ రుతురాజ్ ముగించాడు.