Ravindra Jadeja Obstructing The Field | వివాదంగా మారిన రవీంద్ర జడేజా వికెట్ | ABP Desam
ఐపీఎల్‌లో ఆదివారం సాయంత్రం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’గా అవుటయ్యాడు. మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఇలా అవుటైన మూడో బ్యాటర్ జడ్డూ. గతంలో యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా మాత్రమే ఇలా అవుటయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌లో అవేష్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఐదో బంతిని రవీంద్ర జడేజా థర్డ్ మ్యాన్ వైపు ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా ఇద్దరూ వేగంగా మొదటి పరుగు పూర్తి చేశారు. రవీంద్ర జడేజా రెండో పరుగు కోసం వస్తుండగా రుతురాజ్ గైక్వాడ్ వద్దని వారించాడు. అప్పటికే సగం వరకు వచ్చేసిన రవీంద్ర జడేజా వెనక్కి పరిగెత్తేటప్పుడు వికెట్లకు అడ్డంగా పరిగెత్తాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ వికెట్ కీపర్ సంజు శామ్సన్ వేసిన బంతి రవీంద్ర జడేజా వీపుకు తగిలింది. వెంటనే సంజు శామ్సన్ ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ కోసం అప్పీల్ చేశాడు. సిట్యుయేషన్ మొత్తాన్ని పరిశీలించిన థర్డ్ అంపైర్ రవీంద్ర జడేజాను అవుట్‌గా ప్రకటించాడు. దీని గురించి జడేజా అంపైర్లతో వాదించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈ వికెట్‌పై ఇంటర్నెట్‌లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. జడేజా కావాలని అడ్డం వచ్చాడని కొందరు, అది కావాలని చేసింది కాదని మరికొందు అభిప్రాయపడ్డారు. ఇంతకీ మీరేం అంటారు? రవీంద్ర జడేజా కావాలని అడ్డం వచ్చాడంటారా? అనుకోకుండా అలా జరిగిపోయిందంటారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.