Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. భారత్ కు పతకాల పంట పండిస్తున్న షూటింగ్ లో మన దేశం మరో మెడల్ కైవసం చేసుకుంది. పదిమీటర్ల ఎయిర్ పిస్టల్ పీ2 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యపతాకన్ని కైవసం చేసుకుంది. ఈ మెడల్ తో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన రుబీనా ఫ్రాన్సిస్ వయస్సు 25ఏళ్లు. ఆమె తండ్రి ఓ మాములు మెకానిక్. చిన్నప్పుడు కాలిలో ఏర్పడిన బలహీనత కారణంగా పాదం మెలికపడి రుబీనా వైకల్యానికి గురైంది. అయినా రుబీనా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు తండ్రి ఆమెను షూటింగ్ శిక్షణకు పంపించాడు. తన కసినంతా షూటింగ్ లో చూపించాలని ప్రోత్సహించాడు. అలా 2015లో షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న రుబీనా ఫ్రాన్సిస్ 2017లో మాజీ ఒలింపియన్ గగన్ నారంగ్ అకాడమీ గన్ ఫర్ గ్లోరీకి సెలెక్ట్ అవ్వటం ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు చెందిన జస్పాల్ రాణా వద్ద ట్రైనింగ్ తీసుకున్న రుబీనా ఫ్రాన్సిస్ 2022 నుంచి అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలను కొల్లగొట్టడం ప్రారంభించింది. 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్ లో ఏడో స్థానంతోనే సరిపెట్టుకున్న రుబీనా ఈసారి కాంస్యపతకాన్ని సాధించి దేశానికి ఒలింపిక్ పతకాన్ని అందించింది. ఇప్పటివరకూ సాధించిన ఐదు పతకాలతో భారత్ పతకాల పట్టికలో 22వస్థానంలో ఉంది.