Samit Dravid Selected for India U 19 Team | నాన్న బ్యాటరే...కొడుకు ఆల్ రౌండర్ | ABP Desam
క్రికెట్ దిగ్గజం...మిస్టర్ డిపెండబుల్ గా, ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా భారత క్రికెట్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన రాహుల్ ద్రవిడ్ వారసుడు జాతీయ జట్టులోకి అడుగుపెడుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 18ఏళ్ల సమిత్ ను అండర్ 19 జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్ లో టీమిండియాకు సమిత్ ప్రాతినిథ్యం వహిస్తాడు. రీసెంట్ గా కుచ్ బిహార్ ట్రోఫీలో కర్ణాటక తరపున సమిత్ ద్రవిడ్ అదరగొట్టాడు. 8 మ్యాచుల్లో 362పరుగులు చేయటంతో పాటు 16 వికెట్లు పడగొట్టి తన ఆల్ రౌండింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నాడు. తద్వారా కర్ణాటక కుచ్ బిహార్ ట్రోఫీని గెల్చుకోవటంలో కీలకపాత్ర పోషించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ద్రవిడ్ కొడుకుగా కాకుండా తన టాలెంట్ తో సెలెక్టర్లను ఇంప్రెస్ చేసిన సమిత్ ద్రవిడ్ ఈనెల 21 నుంచి పుదుచ్చేరి వేదికగా వన్డేలు, చెన్నై వేదికగా రెండు నాలుగు రోజుల మ్యాచ్ లను ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్ తో ఆడనున్నాడు. రాహుల్ ద్రవిడ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ఆటగాడిగా, కీపర్ గా, కెప్టెన్ గా అటు రిటైరైనా అండర్ 19 కోచ్ గా, NCA ఛైర్మన్ గా, టీమిండియా కోచ్ గా రీసెంట్ గా టీ20 వరల్డ్ కప్ భారత్ సాధించటంలోనూ రాహుల్ ద్రవిడ్ ది కీలకపాత్ర. అంతటి ఘనమైన లెగసీ నుంచి వస్తున్న సమిత్ ద్రవిడ్ పైనా అతని ఆల్ రౌండింగ్ స్కిల్స్ పైనా భారీ అంచనాలే నెలకొన్నాయి.