Sai Sudharsan 80 Runs vs MI Eliminator | IPL 2025 సీజన్ అంతా పోరాడిన సాయి సుదర్శన్

 నిన్న ముంబై మీద ఎలిమినేటర్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత క్రికెట్ అభిమానుల బాధ అంతా ఒకటే. గుజరాత్ ఓడిపోయిందని కాదు. సాయి సుదర్శన్ కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు అని. ఈ సీజన్ అంతా పరుగుల వరద పారించాడు సాయి సుదర్శన్. ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా క్రీజులో పాతుకుపోయి అసలు తనను డకౌట్ చేయటమే ఏ టీమ్ కు సాధ్యపడలేదు ఈ సీజన్ లో.  నిన్న కూడా అంతే ముంబై విసిరిన 229పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో మొదటి ఓవర్లోనే కెప్టెన్ గిల్ అవుటై వెనుదిరిగినా భయపడలేదు సాయి సుదర్శన్. 49 బాల్స్ లో 10 ఫోర్లు ఓ సిక్సర్ తో 80 పరుగులు చేసి ఓవర్ కి 10 రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ తోడుగా ముంబై పై విజయం సాధించే దిశగానే గుజరాత్ ను నడిపించాడు. అయితే బుమ్రా అద్భుతమైన యార్కర్ కి సుందర్ అవుట్ అవటంతో ఒత్తిడికి లోనైన సాయి సుదర్శన్ రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్ లో లెగ్ సైడ్ స్కూప్ ఆడదాం అనుకుని గ్లీసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్ పోరాటంతో విజయం దిశగా వచ్చిన గుజరాత్ ఆ తర్వాత అంతలా బాదే వాళ్లు లేకపోవటంతో 20 పరుగుల తేడాతో మ్యాచ్ లో ఓడిపోయి ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మొత్తంగా ఈ ఐపీఎల్ లో 15 మ్యాచ్ లు ఆడిన సాయి 759 పరుగులు చేశాడు. 156 స్ట్రైక్ రేట్ తో ఆరు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. సాయి వెనుక 90 పరుగుల వెనుకంజలో సూర్య కుమార్ యాదవ్ 140 పరుగుల వెనుకలో విరాట్ కొహ్లీ ఉన్నారు. ఈ సీజన్ లో గుజరాత్ ప్రస్థానం ముగిసిపోయింది కాబట్టి..సూర్య, కొహ్లీ మరీ అత్యద్భుతంగా ఆడి భారీ సెంచరీలు కొడితే సాయి సుదర్శన్ ను దాటే అవకాశం ఉంటుంది లేదంటే ఈ సీజన్ కు సాయి దే ఆరెంజ్ క్యాప్. రీసెంట్ తను ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కు కూడా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అక్కడ కూడా ఇదే ప్రతిభను కనబరిస్తే టీమిండియా కు ఓ ఫ్యూచర్ సూపర్ స్టార్ దొరికినట్లే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola