Mitchell Starc Bowling in IPL 2024 Final | KKR vs SRH ఫైనల్లో స్టార్క్ స్వింగే ఓ రేంజు | ABP Desam
రూ.24.75 కోట్లు..లెక్కపెట్టాలంటేనే రోజులు పడతాయి. అంత హ్యూజ్ అమౌంట్ వేలంలో దక్కించుకున్నాడు ఆస్ట్రేలియన్ పేస్ అటాక్ మిచెల్ స్టార్క్. అసలు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడేవాడికి అంత డబ్బు ఎందుకు అనేదే ప్రతీ ఒక్కరి ప్రశ్న ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు. 2015వరకూ ఐపీఎల్ ఆడిన స్టార్క్ తర్వాత తన దేశం కోసం ఫ్రాంచైజ్ క్రికెట్ ను వదిలేశాడు. ఫలితమే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, రెండు సార్లు ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ ఇలా అన్నింటిలోనూ ఆసీస్ విజయాల్లో కీలకంగా మారాడు స్టార్క్. తన కల నెరవేరిన తర్వాత వచ్చిన ఈ భారీ అమౌంట్ తో మళ్లీ ఐపీఎల్ పునరాగమనం చేశాడు. అయితే సీజన్ అంతా స్టార్క్ అంతగా ఆకట్టుకుంది లేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఆడుతుండటంతో పావలా కి పనికిరాని వాడికి పాతిక కోట్లు పెట్టారంటూ ఫ్యాన్స్ అంతా దుమ్మెత్తి పోశారు. తొలి 9 మ్యాచుల్లో 7వికెట్లే తీశాడు. కానీ తర్వాత స్టార్క్ గేర్లు మార్చాడు. నాకౌట్ మ్యాచులు దగ్గరకొస్తున్న కొద్దీ తనను ఎందుకు ఆస్ట్రేలియా నెత్తిన పెట్టుకుంటుందో ప్రూవ్ చేసేలా పదునైన స్వింగ్ బౌలింగ్ తో బెంబేలెత్తించాడు. క్వాలిఫయర్ 1లో హెడ్ ను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ మ్యాచులో మూడువికెట్లు సాధించిన స్టార్క్ కోల్ కతాను ఫైనల్ కు చేర్చటంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. తిరిగి ఫైనల్లోనూ స్టార్క్ చెలరేగిపోయాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 14పరుగులే ఇచ్చి అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీలను ఔట్ చేశాడు స్టార్క్. ఈసారి అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన విధానం చూడాలి. అబ్బా స్వింగ్ బౌలింగ్ కి ఉండే సొగసును పరిచయం చేస్తూ కీలక మ్యాచులో కోలకతాను గెలిపించి మూడో ఐపీఎల్ ట్రోఫీ KKR అందుకోవటంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచి తన పాతిక కోట్ల దమ్మేంటో చూపించాడు.