Heinrich Klassen 105 vs KKR IPL 2025 | వరదా వచ్చినా వీడిని ఆపలేడు..అదేం కొట్టుడు రా సామీ
సలార్ లో ప్రభాస్ ని ఆపాలంటే వరదాని అడగాలి ఏమో. కానీ సన్ రైజర్స్ లో హెన్రిచ్ క్లాసెన్ బాదుడు మొదలు పెట్టాడంటే వరదా ఆపినా ఆగడు. కాటేరమ్మ కొడుకి పెను విధ్వంసం ముందు ప్రత్యర్థి ఎవడైనా సరే దాసోహమనాల్సిందే. సరిగ్గా నిన్న అదే జరిగింది. ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ కి సీజన్ కి సరిపడినంత రోషగుల్లా పెట్టి పంపాడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్. మాస్ బ్యాటింగ్. ప్యూర్ నాన్ వెజ్ బఫె. మిడిల్ ఆర్డర్ లో వస్తేనే అంతు చూస్తాడు అలాంటిది వన్ డౌన్ లో బ్యాటింగ్ కి దిగాడు నిన్న కేకేఆర్ పై. అభిషేక్ శర్మ 32 పరుగులు చేస్తే..హెడ్ మాస్టర్ ట్రావియెస్ హెడ్ 40 బాల్స్ లో 6ఫోర్లు 6సిక్సర్లతో 76పరుగులు చేశాడు. వాళ్లిద్దరీ స్టార్టింగ్ ను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తూ కసితీరా సెంచరీ బాదేశాడు క్లాసెన్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసేసి ఢిల్లీలో పరుగుల వరద పారించాడు. మొత్తంగా 39 బంతుల్లో 7ఫోర్లు 9 భారీ సిక్సర్లతో 105పరుగులు చేసిన క్లాసెన్ ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. 37 బాల్స్ లో క్లాసెన్ కొట్టిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యంత వేగవంతమైన సెంచరీ. మొదటి రెండు స్థానాల్లో క్రిస్ గేల్, టీనేజ్ యువకెరటం వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. కాటేరమ్మ కొడుకు పెను విధ్వంసం ధాటికి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోరు కొట్టింది సన్ రైజర్స్. ఈ సీజన్ లో సన్ రైజర్స్ నమోదు చేసిన రెండో అత్యధిక స్కోరు ఇది. 279 పరుగుల భారీ టార్గెట్ తో దిగిన కేకేఆర్...సన్ రైజర్స్ బౌలర్లు ఉనద్కత్, ఈషన్ మలింగ, హర్ష్ దూబే చెరో 3వికెట్లతో చెలరేగిపోయే సరికి 168పరుగులకే ఆలౌట్ అయ్యి హైదరాబాద్ కు 110 పరుగుల భారీ విజయాన్ని అందించింది. సీజన్ ను ఓ రేంజ్ బీభత్సంతో ముగించిన హెన్రిచ్ క్లాసెన్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.