అబ్బాయిలకో న్యాయం? అమ్మాయిలకో న్యాయమా?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి భారత్‌ని ప్రపంచ విజేతగా నిలబెట్టిన టీమిండియా అమ్మాయిలకి బీసీసీఐ అన్యాయం చేసిందంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో మెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమిండియా కోసం భారీ విక్టరీ పరేడ్ నిర్వహించింది బీసీసీఐ. ఆ తర్వాత 2024లో రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా టీమిండియా కోసం ముంబైలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి.. టీమిండియాకి ట్రిబ్యూట్ ఇచ్చింది.
కానీ ఈ సారి అమ్మాయిల టీమ్ దశాబ్దాల నిరీక్షణకి తెరదించుతూ ఫస్ట్ టైం మహిళల వన్డే వరల్డ్ కప్ గెలిచినా కూడా.. బీసీసీఐ ఎలాంటి విక్టరీ పరేడ్ నిర్వహించకపోవడం దారుణమని, ఇది మహిళల టీమ్‌ని చిన్న చూపు చూడటమేనని.. విమెన్స్ క్రికెట్‌కే బీసీసీఐ అన్యాయం చేసిందని.. మండిపడుతున్నారు ఫ్యాన్స్. అమ్మాయిలకో న్యాయం? అబ్బాయిలకో న్యాయం ఏంటని బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దుబాయ్ వేదికగా ఐసీసీ మీటింగ్ జరగబోతుండటంతో బీసీసీఐ.. వరల్డ్‌కప్ విక్టరీ పరేడ్ నిర్వహించడంలేదని సమాచారం.
ప్రస్తుతానికి ఎలాంటి విజయోత్స వేడుకలు ప్లాన్ చేయలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్వయంగా చెప్పారు. అంతేకాకుండా ఐపీఎల్ 2025 సీజన్ గెలిచిన ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విన్నింగ్ సెలబ్రేషన్స్ టైంలో.. భారీ తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు..మరో 50 మందికి తీవ్ర గాయాలయిన విషయం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన వల్ల కూడా విజయోత్సవ వేడుకలకు బీసీసీఐ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.