డబ్ల్యూటీసీ ఫైనల్ లో తొలి రోజు బౌలర్లదే హవా | SA vs Aus WTC 2025 Final Test Day 1 Highlights
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ పైనల్ ఆసక్తికరంగా మొదలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో తొలిరోజు బౌలర్లు హవా చూపించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను గడగడలాడించింది అదే అనుకుంటే సౌతాఫ్రికా అదే స్థాయిలో కుప్పకూలుతోంది. ఫలితంగా మొదటి రోజే 14వికెట్లు పడిపోయి ఫైనల్ చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యింది. మొదట బౌలింగ్ చేసిన తెంబా బవుమా సేన ఆస్ట్రేలియన్ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడింది. ప్రధానంగా కాగిసో రబాడా ఆస్ట్రేలియన్ టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ ను వణికించాడు. రబాడా ధాటికి ఖవాజా డకౌట్ కాగా..కేమరూన్ గ్రీన్ 4 పరుగులు, కమిన్స్, మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. స్టీవ్ స్మిత్ తో కలిసి ఆస్ట్రేలియాను అద్భుతమైన పార్ట్ నర్ షిఫ్ తో ఆదుకున్న వెబ్ స్టర్ వికెట్ కూడా రబాడా నే తీయటంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదు వికెట్ల హాల్ ను అందుకున్నాడు. ఫలితంగా సౌతాఫ్రికా బౌలింగ్ లెజెండ్ అలెన్ డొనాల్డ్ 330 టెస్టు వికెట్ల రికార్డును దాటేశాడు రబాడా. 332 వికెట్లతో ప్రస్తుతం రబాడా స్టెయిన్, పొలాక్, ఎన్తిని తర్వాత అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన సౌతాఫ్రికా బౌలర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. రబాడాతో పాటు మార్కో జాన్సన్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీయటంతో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లార్డ్స్ పిచ్ పై ప్రత్యర్థిని సౌతాఫ్రికా బాగానే కట్టడి చేసిందని చెప్పాలి. కానీ ఎప్పుడైతే సౌతాఫ్రికా బ్యాటింగ్ మొదలైంది. ఇక ఆసీస్ బౌలర్ల హవా ప్రారంభమైంది. ప్రధానంగా మిచెల్ స్టార్క్ తనదైన స్వింగ్ బౌలింగ్ తో నిప్పులు చెరిగాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే సున్నా పరగులకే మార్ క్రమ్ ను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ...ర్యాన్ రికెల్టన్ వికెట్ కూడా తీశాడు స్టార్క్. హేజిల్ వుడ్ ట్రిస్టన్ స్టబ్స్ ను క్లీన్ బౌల్డ్ చేస్తే...కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వియాన్ ముల్డర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా సౌతాఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో కెప్టెన్ తెంబా బవుమా, డేవిడ్ బెడింగ్ హామ్ ఉన్నారు. ప్రధాన బ్యాటర్లంతా ఔట్ అయిపోవటంతో రెండో రోజు సౌతాఫ్రికా ఎంత వరకూ నిలవగలదే దానిపై ఈ టెస్టు ఫలితం ఆధారపడనుంది. మొత్తంగా రెండు జట్లలోని పేసర్లు కలిసి మొదటి రోజే 14 వికెట్లు పడగొట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా మొదలు పెట్టారు.