Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం ఓటమితో మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోకు మొదట్లోనే షాక్ తగిలింది. బ్యాటింగ్ పిచ్‌పై వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్ కాసేపు పోరాడినా.. ఢిల్లీ బౌలర్లు లుంగి ఎంగిడి, నటరాజన్ ధాటికి లక్నో 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలో ప్రిన్స్ యాదవ్ చుక్కలు చూపించాడు. 26 పరుగులకే 4 వికెట్లు తీసి లక్నోను రేసులోకి తెచ్చాడు. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ చెలరేగిపోయాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి 119 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.

మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. తన అన్-లక్కీ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అన్నాడు. "నేను తప్పుడు సమయంలో రనౌట్ అయ్యాను. లేదంటే స్కోరు మరోలా ఉండేది. బ్యాటింగ్ వికెట్‌పై మేము సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం" అని అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో 20 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం తమ ఓటమికి మరో కారణం అంటూ పంత్ స్పష్టం చేశాడు. తక్కువ స్కోరు ఉన్నప్పుడు వికెట్ల కోసం ప్రయత్నించి వైడ్లు, నోబాల్స్ వేయడం విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola