Jasprit Bumrah shoes For Lords Museum | లార్డ్స్ లో అరుదైన ఘనత సాధించిన జస్ ప్రీత్ బుమ్రా | ABP Desam
క్రికెట్ పుట్టినిల్లు, మక్కా ఆఫ్ క్రికెట్ అని పిలుచుకునే లార్డ్స్ మైదానంలో భారత పేస్ దళం నాయకుడు జస్ ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా ఇంగ్లీష్ ఇన్నింగ్స్ ను 387 పరుగులకు కట్టడి చేశాడు. బుమ్రాకు విదేశాల్లో ఐదు వికెట్లు తీయటం ఇది 13వసారి. ఫలితంగా విదేశాల్లో అత్యధిక సార్లు ఐదువికెట్లు తీసిన భారత బౌలర్ గా తన పేరు పై కొత్త రికార్డు క్రియేట్ చేశాడు బుమ్రా. ఇప్పటి వరకూ 12సార్లు అలా విదేశాల్లో ఐదు వికెట్లు తీసి లెజండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ పేరు మీదున్న ఈ రికార్డును బూమ్ బూమ్ దాటేశాడు. అంతే కాదు ఈ ఏడాది ఇప్పటివరకూ లార్డ్స్ లో ఐదు వికెట్లు సాధించిన బౌలర్ గా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తర్వాత జస్ ప్రీత్ బుమ్రానే నిలిచాడు. లార్డ్స్ లో ఐదు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో బుమ్రా పేరును బోర్డుపై బుమ్రాతోనే రాయించిన తర్వాత తను ఐదు వికెట్లు సాధించిన షూస్ ను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మ్యూజియం నిర్వాహకులు తీసుకున్నారు. విదేశాల్లో జస్ ప్రీత్ బుమ్రా సాధిస్తున్న వికెట్ల ఘనతలను, అతని ప్రతిభను గౌరవిస్తూ జస్ ప్రీత్ బుమ్రా సంతకం చేసిన అతని బూట్లు ఇకపై లార్డ్స్ క్రికెట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉండనున్నాయి. ఈ అరుదైన ఘనతను సాధించిన ఆటగాళ్ల జాబితాలో బుమ్రా చేరాడు. 1983లో లార్డ్స్ లోనే వరల్డ్ కప్ ను అందుకున్న భారత కెప్టెన్ కపిల్ దేవ్ జెర్సీని లార్డ్స్ మ్యూజియం సేకరించింది. తర్వాత సచిన్ టెండూల్కర్ నుంచి బ్యాట్ , ఇప్పుడు బుమ్రా షూస్ కి మాత్రమే లార్డ్స్ క్రికెట్ మ్యూజియం గౌరవ ప్రదర్శన హోదా దక్కింది.