Aus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP
మనోళ్లు మళ్లోసారి పులిహోర కలిపేశారు. మొదటి టెస్టులో ఘన విజయం సాధించి రెండో టెస్టును ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాల్సిన భారత్...అడిలైడ్ డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టును పేలవంగా ఆరంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 180పరుగులకే ఆలౌట్ అయిపోయింది. మొదటి టెస్టులో మిచెల్ స్టార్క్ ను యశస్వి జైశ్వాల్ లాంటి యంగ్ స్టర్స్ ఓ ఆటాడుకుంటే ఈ సారి మిచెల్ స్టార్క్ తన బౌలింగ్ పదునేంటో చూపించాడు. తనను ట్రోల్ చేసిన యశస్వి జైశ్వాల్ ను డకౌట్ చేయటంతో పాటు రాహుల్, కొహ్లీ, నితీశ్ రెడ్డి, అశ్విన్, హర్షిత్ రానాల వికెట్లు తీసుకుని 6వికెట్లతో టీమిండియాను కుప్పకూల్చాడు. కమిన్స్, బోలండ్ కూడా చెరో రెండు వికెట్లు తీసి స్టార్క్ కు సహకరించారు. 42పరుగులు మరోసారి నితీశ్ రెడ్డి మనల్ని ఆదుకుని ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగేలా చేశాడు. అయితే మొదటి టెస్టులో కూడా ఇలాగే టీమిండియా 150 కి ఆలౌట్ అయిపోయినా ఆస్ట్రేలియాను 104పరుగులకే ఆలౌట్ చేసింది. అదే స్ఫూర్తితో ఈ సారి కంగారూల పని పడదామని మన బౌలర్లు అనుకున్నా...అది సాధ్యపడలేదు. ఖవాజాను బుమ్రా త్వరగానే అవుట్ చేసినా మరో వికెట్ పడకుండా మెక్ స్వీనే, లబుషేన్ అడ్డుపడ్డారు. దీంతో స్టంప్స్ టైమ్ కి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 86పరుగులు చేసి..డే 1లో డామినెన్స్ ను చూపించింది. రెండోరోజు ఆసీస్ ను త్వరగా ఆలౌట్ చేస్తే కానీ భారత్ ఈ టెస్టులో పుంజుకోవటం కష్టం అవుతుంది.